పన్నెండు రకాల కేన్సర్లు.. ఒక్క అమెరికాలోనే లక్షా అరవై ఏడు వేల మరణాలు. కారణం మాత్రం ఒక్కటే! పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలే ఇవన్నీ.. అమెరికాలో ఏటా కేన్సర్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు సగంమంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం, స్వరపేటికకు సంబంధించిన కేన్సర్లతోనే పోతున్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వీటిలో చాలా మరణాలు ‘కొని’తెచ్చుకున్నవేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అట్లాంటాలోని అమెరికన్ కేన్సర్ సొసైటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సిగరెట్ పొగ వల్ల 12 రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్ మొదటిది, ముఖ్యమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2011 ఏడాదిలో అమెరికా వ్యాప్తంగా పలు రకాల కేన్సర్లతో మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు కాగా అందులో 1.67 లక్షల మరణాలకు సిగరెట్ పొగే కారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రెబెక్కా సీగల్ వివరించారు. ఈ గణాంకాలు కేవలం పొగరాయుళ్లవేనని, వారు వదిలే పొగతో కేన్సర్ బారిన పడ్డ వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వాడకంపై చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు.
No comments:
Post a Comment