Wednesday 3 February 2016

ఇవాళ వాల్డ్ కేన్సర్ డే

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలలో 6 లక్షల మంది మృత్యువాత.. ఏ వైపరీత్యమో సంభవించి వీరు ప్రాణాలు కోల్పోవడం లేదు.. ఇంతటి భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవడంతో అన్ని దేశాల్లో ఒకటే కలవరం.. ఇదీ కేన్సర్ వ్యాధి విసిరిన పంజా.. ఈ వ్యాధి కారణంగా అకాలమృత్యువు పాలవుతున్న వారిలో మహిళల సంఖ్యే అధికం.. రాబోయే 20 నుంచి 40 ఏళ్లలో కేన్సర్ మరణాల సంఖ్య రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింతగా భయాందోళనల్ని కలిగిస్తున్నాయి. కేవలం భారత్‌లోనే ఏటా పదిలక్షల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.. ఇందులో లక్ష మంది మహిళలు రొమ్ము కేన్సర్‌కు లోనవుతున్నారు. ప్రధానంగా రొమ్ము, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లతో మహిళలు రోగపీడితులవుతున్నారు. సరైన వైద్య సహాయం లభించక పేద, మధ్య తరగతి స్ర్తిలు ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని దేశాల్లోనూ కేన్సర్ మరణాల సంఖ్య భారీగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలు కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించింది. కేన్సర్‌పై విశ్వవ్యాప్తంగా అవగాహనకు ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ‘వరల్డ్ కేన్సర్ డే’ పాటిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ‘నివారణ, నిర్ధారణ, చికిత్స’- అనే మూడు అంశాలకు ప్రాధ్యామిస్తూ కేన్సర్‌పై ప్రచారానికి దేశదేశాల్లో ఎనె్నన్నో స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. కేన్సర్ నివారణకు ‘యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కం ట్రోల్’ (యుఐసిసి) ఏర్పాటైంది. ఇందులో 120 సభ్య దేశాలకు చెందిన 470 ప్రభుత్వేతర సంస్థలు కేన్సర్ అంతానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. మరణాల సంఖ్యను తగ్గించేందుకు ముందుగా అందరిలో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఏటా ఫిబ్రవరి 4న ‘వరల్డ్ కేన్సర్ డే’ను పాటిస్తున్నారు.


                             మనకు తెలియకుండా మాటు వేసి, దొంగ దెబ్బ తీస్తున్న కేన్సర్ మహమ్మారి నానాటికీ తన వికృత రూపంతో భయపెడుతోంది. శరీరంలో ఏ భాగంలో ఈ వ్యాధి సోకుతుందో ముందు గా చెప్పలేని పరిస్థితి ఉంది. శరీరంపై ఏదో ఒక భాగంపై ‘టార్గెట్’ చేశాక.. ఇది ఎప్పుడు బయట పడుతుందో చెప్పలేం. వ్యాధిని గుర్తించాక అప్పటికే ఎంతో నష్టం జరిగిపోవచ్చు. ఆ తర్వాత చికిత్స వల్ల ఏ మేరకు ఫలితం ఉంటుందో వైద్యులు సైతం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నోరు, గొంతు, మెదడు, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, జీర్ణాశయం, కిడ్నీలు, గర్భాశయ ముఖద్వారం, థైరాయిడ్, గాల్‌బ్లేడర్.. ఇలా శరీరంలో ఏ భాగంలోనైనా కేన్సర్ విరుచుకుపడొచ్చు.
                        ఆహారంలో లోపాలు, చెడు అలవాట్ల కారణంగా చాలామంది కేన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు  హెచ్చరిస్తునే ఉన్నారు. వ్యాధిగ్రస్తుల్లో నూటికి 70 శాతం మంది చేజేతులా సమస్యలను ఆహ్వానిస్తున్నవారేనని వైద్యు లు చెబుతున్నారు. ఆహార లోపాలు, దురలవాట్లను అరికడితే 30 శాతం వరకూ కేన్సర్‌ను నివారించే అవకాశాలు లేకపోలేదు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. ముందుగా ఈ వ్యాధికి సంబంధించి సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. శరీరంపై కణుతులు, గడ్డలు ఏర్పడడం, గాయాలు మానకపోవడం, అసాధారణ రక్తస్రావం, నిత్య అజీర్ణం, చాలాకాలంగా గొంతు రాపిడి తదితర లక్షణాలు ఈ వ్యాధికి ప్రారంభ సంకేతాలని గమనించాలి. రొమ్ము, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార, పెద్దపేగు తదితర శరీర భాగాలపై కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే అవకాశాలున్నాయి. కేన్సర్ అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? ఎన్ని రకాలుగా దాడి చేస్తుంది?, గుర్తించడం ఎలా? నివారణ పద్ధతులు ఏమిటి?.. అనే అంశాలపై విస్తతృ ప్రచారం చేస్తేనే ప్రజల్లో అవగాహనకు ఆస్కారముంది.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎంతగా హెచ్చరిస్నున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చాలామంది చెడు అలవాట్లకు దాసోహమవుతునే ఉన్నారు. సిగరెట్, బీడీ, గుట్కా, మద్యపానం, లైంగికంగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లు, ఊబకాయం, తగినంత ఆహారం తీసుకోకపోవడం కేన్సర్‌కు కొన్ని కారణాలని వైద్య నిపుణులు ఘోషిస్తునే ఉన్నారు. వాతావరణ కాలుష్యం, పదే పదే మరగించి వంట నూనెలు వాడడం కూడా కేన్సర్ దాడికి అవకాశం కల్పిస్తున్నాయి. పండ్లు, శాకాహారాన్ని తగినంతగా తీసుకోకపోవడం కూడా మరో కారణం.
                      తగిన అవగాహన ఉంటే నోరు, గర్భాశయం, రొమ్ము కేన్సర్‌లను ముందుగానే గుర్తించే అవకాశాలున్నాయి. కొన్ని రకాల కేన్సర్‌లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్సకు వీలుంది. చాలామంది తొలి దశలో దీన్ని గమనించలేకపోతున్నారు. ఇది బాగా ముదిరిన సందర్భాల్లోనే అధిక శాతం వ్యాధిగ్రస్తులు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. కేన్సర్ నిర్ధారణ, నివారణ అన్నది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో పేదవర్గాల వారు మేలైన చికిత్సకు దూరంగానే ఉండడం ఆందోళనకరం.
                                   కేన్సర్‌పై విశ్వవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ ఏడాది వినూత్న ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ‘యుఐసిసి’ (యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కంట్రోల్) సంస్థ సంకల్పించింది. ఈ ఏడాది ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ‘అంతా ఒక్కటైతే సాధ్యమే’ అన్న నినాదాన్ని యుఐసిసి ఇచ్చింది. ఈ ఏడాది న్యూయార్క్‌లోని ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ను నీలం, ఆరంజ్ రంగులతో కాంతులీనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే, ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’ల ద్వారా కేన్సర్ నివారణకు సందేశాలు పంపేవారు తమ ఫొటోలను నీలం, ఆరంజ్ రంగుల్లో పంపాలని యుఐసిసి కోరుతోంది. కేన్సర్‌పై అవగాహనకు ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు, ర్యాలీలు, లఘు చిత్రాలు, ఇతర రూపాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు. మంచి ఆహారం, చెడు అలవాట్లు వంటి విషయాలపై భారీగా ప్రచారం చేయాలని, ఇందుకు అన్ని దేశాల్లో పాలకులు, అధికారులు తగిన బాధ్యత తీసుకోవాలని యుఐసిసి విజ్ఞప్తి చేసింది. 2025 నాటికి కేన్సర్ మరణాల సంఖ్య 25 శాతం తగ్గేలా అన్ని దేశాలు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయాలని డబ్ల్యుహెచ్‌ఓ పిలుపునిచ్చింది.
             ప్రపంచానే్న భయపెట్టిన ‘ఎయిడ్స్’ వ్యాధిపై ఏ విధంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిందో, కింది స్థాయి వరకూ చికిత్సలను అందుబాటులోకి తెచ్చారో అదే రీతిలో కేన్సర్ నివారణకు భారీ ప్రయత్నాలు జరగాలని వైద్యరంగ ప్రముఖులు కోరుతున్నారు. మన దేశంలో పేదలు, మధ్య తరగతి వారే అధికంగా ఉన్నందున వీరిలో కేన్సర్ పీడితులకు ఉచిత చికిత్సలు అందాలి. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సలకు ఆధునిక యంత్ర పరికరాలను వీరికి అన్ని స్థాయల్లో అందుబాటులో ఉంచాలి. *