Tuesday 31 May 2016

టొబాకోతో కేన్సర్ ముప్పు

పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని చాలా మం దికి తెలిసినప్పటికీ అది ఎంత మేరకు హాని కలిగించగలదో చాలా మం దికి తెలియదు. అయితే ఒకప్పటితో పోలిస్తే పొగ తాగే వాళ్లు తగ్గారు. అంతేకాదు గతంలో మాదిరిగా థియేటర్లలో, బస్సుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం బాగా తగ్గింది. ఇది ఆశించిదగిన శుభపరిణామమనే చెప్పాలి. పలు దేశాల కోరిక మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని ముఖ్య సందేశం ఏమిటంటే ఆరోగ్యపరంగా పొగాకు వల్ల కలిగే హానిని గురించి హెచ్చరికలను పొగాకు ప్యాకెట్లపై రాతతో బాటు చిత్రాలను కలిపి చూపినట్టైతే, అది ప్రజావగాహనను పెంచడానికి, ఖర్చుపరంగా అన్నిం టికన్నా చాలా అనువైన విధానం. ఈ విధంగా పొగాకు వాడకం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెలియజేస్తూ, దాని
వాడకాన్ని తగ్గించవచ్చు.2000 నాటికి 1.22 బిలియన్‌ ప్రజలు ధూమ పానం చేస్తున్నారు. ఇది 2010 నాటికి 1.45 బిలియన్ల మందికి చేరుకుంది. 2025 నాటికి 1.5 నుండి 1.9 బిలియన్ల మంది ప్రజలు ధూమపానం చేస్తారని అంచనా. దీని విస్తరణ సంవత్సరానికి 1% తగ్గుతుందని అనుకుంటే 2% ఆదాయం పెరుగుతుంది,


 ధూమపానం చేసేవారి సంఖ్య 2010-2025 నాటికి 1.3 మిలియన్ల వద్ద ఉంటుందని అంచనా.సాధారణంగా ఆడవారి కంటే మగవారిలో ధూమపానం ఐదురెట్లు ఎక్కువ. అయితే యుక్త వయసులో ఈ లింగభేదం ఎక్కువగా లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో ధూమపాన రేట్లు ఉచ్ఛస్థితికి చేరి తగ్గు తున్నాయి. అయితే మహిళల్లో మాత్రం పొగతాగే వారి సంఖ్య పెరుగుతున్న గణాంకాలు చెబుతున్నాయి.పొగాకు వాడకంతో కలిగే వ్యాధులు, మరణాలు పేదవారిలో ఎక్కువగా ఉంటున్నాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ నివేదిక తెలియచేస్తోంది. ధూమపానం చేసే 1.22 బిలియన్ల మందిలో, బిలియన్‌ మంది ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచంలో పొగాకు వినియోగం సాలుకు 3.4% పెరుగుతోంది.2004లో ప్రపంచవ్యాప్తంగా 58.8 మిలియన్ల మరణాలను ఊహించగా, వీటిలో 5.4 మిలియన్లు పొగాకుకు ఆపాదించబడ్డాయి. 2007లో ఇవి 4.9 మిలియన్లుగా ఉంటాయని అంచనా. 2002 నాటికి ఈ మరణాలలో 70% అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవిస్తున్నాయి.

Saturday 28 May 2016

ప్రపంచ మహిళా ఆరోగ్య దినోత్సవం

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా జీవించడానికి కావలసింది సమతులాహారం. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలు చేయాలనీ, పౌష్టికాహారం తీసుకోవాలనీ చెడు అలవాట్లు మానుకోవాలనీ అందరూ అంటూంటారు. చాలామంది నుంచి ఎప్పుడూ వినే మాటలే ఇవి. అయితే నిజమైన ఆరోగ్యం మన నిత్య జీవనంపై ఆధారపడి ఉందన్న సంగతిని చాలామంది విస్మరిస్తున్నారు. స్త్రీ, పురుషుడు అని తేడా లేకుండా ప్రతి స్టేజిలో న్యూట్రిషన్ ఫుడ్ అవసరమవుతుంది. కానీ ఇంటిపనులను చూసుకొంటూ, పిల్లలను స్కూలుకు పంపడం, భర్తకు అన్నీ పనులు చేయడం, ప్రతీ రోజూ చేస్తూ అలసి పోయే స్త్రీలకుతమ శరీరాన్ని ఫిట్ గా, హెల్తీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి మహిళల్లో ఆరోగ్యపరమైన సమస్యలెన్నో తలెత్తుతున్నాయి. అయితే వాటిని ఎలా అధిగమించాలో తెలియక అనారోగ్యాల పాలు అవుతున్నారనటం నిజం. కాని మహిళల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని పాటిస్తే చాలు అంటున్నారు న్యూట్రీషియన్లు. కాబట్టి మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారం గురించి తెలుసుకుందాం.

పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి. స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలీప్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. అంతే కాకుండా కాలిఫ్లవర్ లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.

Tuesday 24 May 2016

బ్రెడ్ తింటే కేన్సర్ ఫ్రీ

భారత మార్కెట్లో ప్రముఖ సంస్థలు అందిస్తున్న బ్రెడ్ సంబంధ ఆహార పదార్థాల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్‌ఈ) పరీక్షల్లో తేలింది. బ్రిటానియా, కేఎఫ్‌సీ, పిజ్జాహట్, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే, స్లైస్ ఆఫ్ ఇటలీ వంటి అనేక ఫుడ్ చైన్ రెస్టారెంట్లు అందిస్తున్న  ఆహార పదార్థాల్లో పొటాషియం బ్రొమేట్, పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు సీఎస్‌ఈ సోమవారం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిసింది. ఢిల్లీలోని అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, బ్రాండ్ల ఆహార ఉత్పత్తులను సీఎస్‌ఈ పరిశీలించింది. ప్యాక్ చేసిన బ్రెడ్లు, బ్రెడ్డుతో తయారైన పావ్‌లు, బన్‌లు, బర్గర్‌లు, పిజ్జాలు వంటి 38 నమూనాలను సీఎస్‌ఈ పరీక్షించింది.

వీటిలో 84 శాతం  పదార్థాల్లో కేన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రసాయనాలను అనేక దేశాలు ఇప్పటికే నిషేధించాయి. కానీ భారత్‌లో నిషేధం లేదు.  బ్రిటానియా, కేఎఫ్‌సీ, డొమినోస్, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వేలు ఈ హానికర పదార్థాలను తాము వాడడం లేదన్నాయి.  నమూనాలను తమ పొల్యూషన్ మానిటరింగ్ ల్యాబోరేటరీ (పీఎంఎల్)లో పరీక్షించిన అనంతరం, బయటి ప్రయోగశాలల్లో కూడా పరిశీలించాకే ఈ నివేదిక విడుదల చేశామని సీఎస్‌ఈ ఉప డెరైక్టర్ జనరల్ చంద్రభూషణ్ తెలిపారు. 38 నమూనాలను పరీక్షించగా 32 ఉత్పత్తుల్లో 1.15 నుంచి 22.54 పీపీఎం వరకు పొటాషియం బ్రొమేట్,పొటాషియం అయొడేట్‌లు ఉన్నట్లు తేలిందన్నారు. కాగా, సీఎస్‌ఈ నివేదికలోని అంశాలపై విచారణ జరిపినివేదిక ఇవ్వాలని  ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారులను ఆదేశించారు.

షుగర్ తో కేన్సర్ కు చెక్

సాధారణంగా షుగర్ వ్యాధి వచ్చిందంటే, దానికి సంబంధించి కొన్ని ఇతర వ్యాధులు కూడా వస్తూంటాయి. అయితే షుగర్ వ్యాధి నియంత్రణకు వాడే మెట్ ఫార్మిన్ మందుతో మహిళలలో వచ్చే బ్రెస్ట్ కేన్సర్ వ్యాధిని కూడా నయం చేయవచ్చని పరిశోధనలు తెలుపుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ కు వాడే మందులద్వారా అనేక సహజ లేదా కృత్రిమ రసాయనాలవలన పెరిగే బ్రెస్ట్ కేన్సర్ కణాలను అరికట్టవచ్చునని ఒక తాజా పరిశోధన తెలిపింది. ఈ రీసెర్చి దక్షిణ కొరియా లోని సియోల్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ ట్రోస్కో, అతని సహచరులు నిర్వహించారు.




టైప్ 2 డయాబెటీస్ నివారణకు ఉపయోగించే మెట్ ఫార్మిన్ మందును దీర్ఘకాలంలో వాడితే బ్రెస్ట్ కేన్సర్ కారక కణాలు కూడా మరణిస్తాయని పరిశోధకులు తెలిపారు. టైప్ 2 డయాబెటీస్ వున్నవారికి డయాబెటీస్ సంబంధిత కేన్సర్ లు అంటే బ్రెస్ట్, లివర్, పాన్ క్రియాటిక్ కేన్సర్ లు వచ్చే అవకాశం వుందని ప్రొఫెసర్ ట్రోస్కో తెలిపారు.


Sunday 22 May 2016

కేన్సర్ సూచికలు

మాలిగ్నెంట్ ట్యూమర్లు నుంచి కొన్ని కాన్సర్ కణాలు విడిపోయి, దేహంలో, ఏర్పడిన ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంలోకి చేరి ద్వితీయ ట్యూమర్లను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియను మెటాస్టాసిస్  అంటారు. ఇవి తొందరగా పెరుగుతాయి, ప్రమాదకరం, ప్రాణాంతకమైనవి. బినైన్ ట్యూమర్లు  సాధారణంగా నెమ్మదిగా పెరిగి, చిన్నవిగా ఉండి, ఒక తంతుయుత పొరచే కప్పబడి స్థానికంగా ఏర్పడతాయి. ఇవి మెటాస్టాసిస్ ను ప్రదర్శించవు. ఇవి హానికరమైనవి కావు. చిన్న శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చును.


కేన్సరు సప్త సూచికలు

    మానని పుండు (Ulcer)
    అసహజమైన రక్త స్రావం (Bleeding)
    పెరుగుతున్న కంతి (Tumor)
    తగ్గని దగ్గు (Cough), బొంగురు గొంతు (Hoarseness of voice)
    మలంలో రక్తం, మలవిసర్జన లో మార్పు
    తగ్గని అజీర్తి, మింగుట కష్టం
    పుట్టుమచ్చలలో మార్పు

కేన్సర్ కథ

ఇంగ్లీషులో 'టుమర్‌' అన్న మాటకి 'వాపు' అన్నది వాచ్యార్ధం. కణాలు విభజన చెంది అతిగా ఒక చోట చేరితే వచ్చే వాపు ఇది. అప్పుడప్పుడు ఈ వాపు చిన్న 'కాయ' రూపంలో తారస పడుతుంది. అప్పుడు దానిని 'కంతి' అంటారు. ఈ కంతి అన్నది రెండు స్వరూపాలలో తారసపడవచ్చు: నిరపాయమైన కంతులు , ప్రమాదమైన కంతులు . నిరపాయమైన కంతులని మూడు లక్షణాల ద్వారా గుర్తు పట్టవచ్చు.

    అవి నిరవధికం, దూకుడుతనంతో పెరిగిపోవు. అవి ఇరుగు పొరుగు కణజాలం  మీదకి విరుచుకు పడవు.    శరీరంలో ఒకచోటి నుండి మరొక చోటికి దండయాత్ర చెయ్యవు కొన్ని రకాల కేన్సర్ల పేర్లు -ఓమా శబ్దంతో అంతం అవుతాయి: కార్సినోమా, సార్కోమా, మొదలయినవి. ఈ -ఓమా అనే ఉత్తర ప్రత్యయం ఉంటే అది కంతి రూపంలో ఉందని అర్ధం. మెలనోమా అంటే మెలనోసైట్‌ లు  విపరీతంగా పెరిగి కంతిలా ఏర్పడటం. ఈ మెలనిన్‌ కణాలు మన శరీరపు ఛాయని నిశ్చయించ గలవు.

డీ విటమిన్ తో కేన్సర్ కు చెక్

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మరణాలకు కారణమవుతున్న పురీషనాళ క్యాన్సర్ కు విటమిన్ డి చక్కగా నియంత్రిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. శాస్త్రజ్ఞులు విటమిన్ 'D', సీరం విటమిన్ 'D' మరియు పురీషనాళ క్యాన్సర్ ల మధ్య గల సంబంధాలపై జరిపిన పరిశోధనల్లో విటమిన్ 'D' పురీషనాళ క్యాన్సర్ ను తగ్గిస్తుందని తేలింది.

    విటమిన్ 'D' రొమ్ము క్యాన్సర్ ను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కూడా రుజువైంది. దీనిపై జరిపిన పరిశోధనలలో, కాల్షియం మరియు విటమిన్ 'D' తీసుకోవటం వల్ల  రొమ్ము క్యాన్సర్ ప్రభావాన్ని కట్టడి చేయొచ్చని తేలింది.
   

పొంచి ఉన్న పెద్దపేగు కేన్సర్

జీవనశైలి మార్పుల కారణంగా వస్తున్న ప్రాణాంతక సమస్యల్లో పెద్దపేగు కేన్సర్ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ తరహా కేన్సర్ కేసులు పెరగటం ఏంటో ఆందోళన కలిగిస్తోన్న అంశం. అయితే సమస్యకు గల కారణాలను అవగాహన చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొంటే ఈ సమస్యను నివారించటం సాధ్యమే. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత మిగిలిన వ్యర్ధాలు మలంగా మారతాయి. దీనిని బయటికి పంపటమే పెద్దపేగు పని. పెద్దపేగు(కొలన్)కు సోకిన కేన్సర్ ను  కొలన్ కేన్సర్ అనీ, పెద్దపేగు చివరి భాగమైన పాయువు(రెక్టం) కు సోకితే రెక్టల్ కేన్సర్ అంటారు.




ఈ తరహా కేన్సర్ సోకినప్పుడు పేగు బిగుసుకు పోవటం, పేగులోపల తిత్తులు(పాలిప్స్) ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు అసలు కనిపించక పోవచ్చు. పెద్దపేగు కేన్సర్ వంశపారంపర్యంగా వస్తుందని చెప్పే ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినా రాదని మాత్రం గ్యారెంటీ లేదు. అందుకే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా 15 ఏళ్ళు నిండిన వారి పిల్లలకు ఏడాదికి ఒకసారి ఈ పరీక్షలు చేయించటం అవసరం. ఎంత ముందుగా సమస్యను గుర్తించగలిగితే అంత  సమర్ధవంతంగా దీన్ని నయం చేయవచ్చు. సమస్యను ప్రాథమిక స్థాయిలో గుర్తించే పలు ఆధునిక పరీక్షలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Friday 20 May 2016

పండ్లతో కేన్సర్ కు చెక్

పండ్లు, కూరగాయలు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో మనిషి శరీరానికి అవసరమైన ఎన్నో పోషక విలువలు వుంటాయి. ప్రతిరోజూ తాజా పండ్లు, కూరలు తినే వారికి సాధారణంగా ఎటువంటి అనారోగ్యాలు కలుగవు. మానవుడి ఆహారంలో పండ్లు, కూరగాయలు ప్రాచీనకాలంనుండి ప్రధానపాత్ర వహిస్తున్నాయి. లక్షలాదిమంది ప్రజలు పండ్లు, కూరగాయలు తినటానికి ప్రాధాన్యతనివ్వరు. దీనితో వీరికి కేన్సర్ వంటి మొండి రోగాలు అనారోగ్యం వచ్చే అవకాశం వుంటుందని ఒక తాజా సర్వే తెలుపుతోంది.


బ్రిటన్ లో నిర్వహించిన ఒక సర్వేలో అక్కడి ప్రజలలో ప్రతి అయిదుగురిలో ఒకరు మాత్రమే పండ్లు , కూరగాయలు సిఫార్సు చేసిన స్ధాయిలో తింటున్నట్లు ప్రపంచ కేన్సర్ పరిశోధనా సంస్ధ తెలిపినట్లు రీసెర్చి వెల్లడించింది. వృక్ష సంపద ఆహారమైన గింజలు, ధాన్యాలు, పండ్లు, కూరగాయలు కేన్సర్ రిస్కు తగ్గిస్తాయని, వీటిని తరచుగాను అధికంగాను లేదా సిఫార్సు చేసిన స్ధాయిలో కనుక తింటే వారికి ఏ రకమైన కేన్సర్ వచ్చే అవకాశం లేదని రీసెర్చర్లు తెలిపారు. పీచు అధికంగా వుండే ఆహారాలు, పేగు కేన్సర్ నివారణకు కూడా తోడ్పడతాయని సంస్ధ పరిశోధకులు చెబుతున్నారు.

బాల్యానికి చెక్ పెడుతున్న కేన్సర్

ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక చిన్నారి కేన్సర్‌ బారినపడుతోంది. అలాగే మన దేశంలో ఏటా యాభై వేల మంది పిల్లలకు ప్రమాదకరమైన కేన్సర్‌ వ్యాధి సోకుతోంది. దురదృష్టమేంటంటే.. కేన్సర్‌ గురించి సరైన అవగాహన లేకపోవడం, వ్యాధిని సరైన సమయంలో గుర్తించలేకపోవడం, ఒకవేళ గుర్తించినా వైద్య సదుపాయం అందకపోవడంతో దాదాపు 50 నుంచి 70 శాతం చిన్నారులు కేన్సర్‌తో మృత్యువాతపడుతున్నారు.


కెన్‌కిడ్స్‌ అనే సంస్థ ఈ వాస్తవాల్ని వెల్లడించింది. బాల్యంలోనే కేన్సర్‌ బారిన పడుతున్న చిన్నారుల గురించి మనదేశంలో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. కొన్ని కుటుంబాల్లో కేన్సర్‌ వ్యాధిగ్రస్తులున్నా.. దానిగురించి మాట్లాడుకోలేని స్థితి ఉందనీ, అందుకే ఈ విషయాలు వెల్లడించాం అంటోంది కెన్‌కిడ్స్‌ సంస్థ. కేన్సర్‌ ఓ అంటరానిపదంగా మారిపోయిందనీ, అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధి గురించి కచ్చితంగా చర్చించుకోవాల్సి ఉందనీ ఈ సంస్థ చెబుతోంది.

Tuesday 17 May 2016

ప్రొస్టేట్ కేన్సర్ కు కొత్తరకం చెక్

కేన్సర్‌ నిర్మూలనకు రకరకాల చికిత్సలను శాస్త్రవేత్తలు కనుగొంటున్నది మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఒక్క టీకాతో కేన్సర్‌ను చంపిపారేయొచ్చని ఓ డాక్టర్‌ తన పరిశోధనలో వెల్లడించారు. తాజాగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నిరోధించే సరికొత్త ఆవిష్కరణను ఆసే్ట్రలియా పరిశోధకులు కనుగొన్నారు. ప్రోస్టేట్‌ కేన్సర్‌ కణాల పెరుగుదలకు కారణమైన గ్లుటామైన్‌ను పంపిణీ చేసే నాళాలకు అడ్డుకట్ట వేస్తే.. కేన్సర్‌ కణాలు ఆకలితో అలమటించి చనిపోతాయని సిడ్నీ సెంటెనరీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు జెఫ్‌ హోల్ట్స్‌ తెలిపారు.

ప్రస్తుతం సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి అదేపనిలో ఉన్నామన్నారు. కాగా, అండాశయ కేన్సర్‌లో కీమోథెరపీ చికిత్స ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో.. అసలు పనిచేస్తుందో లేదో తెలుసుకునే జీవసూచిక ను భారత సంతతికి చెందిన మాధురీ కోటి కనుగొన్నారు. కెనడా క్వీన్స్‌ యూనివర్సిటీలో ప్రస్తుతం ఆమె పనిచేస్తున్నారు.

బాల్యంలో పండ్లు తింటే కేన్సర్ కు దూరం

బాల్యంలో పండ్లు ఎక్కువగా తింటే రొమ్ముకేన్సర్‌ బారిన పడే ముప్పు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ కేన్సర్‌ మరింత అధికమయ్యే ముప్పుదని, అమెరికాలోని టిహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

90వేల మంది నర్సులను 20ఏళ్ల పాటు పరిశీలించారు. చిన్నతనంలో వాళ్ల ఆహారపు ఆలవాట్లు, పండ్లు అధికంగా తీసుకున్నారో లేదా వివరాలను సేకరించారు. చిన్నతనంలో ఎక్కువగా పండ్లు తీసుకున్న వారిలో రొమ్ముకేన్సర్‌ ముప్పు 25శాతం తక్కువగా ఉందని తెలిపారు. 

Monday 16 May 2016

సిక్కోలును వణికిస్తున్న కేన్సర్

కేన్సర్‌ వ్యాధి అంటేనే జనం భయపడిపోతారు. వ్యాధి ప్రారంభంలో ఉందా, లేదా ముదిరిందా అనేదానితో నిమిత్తం లేకుండా ఆందోళనపరిచే వ్యాధి ఇది. ప్రస్తుతం ఇది శ్రీకాకుళం జిల్లా ప్రజలను బెంబేలె త్తిస్తోంది. ఒకవైపు నిరుద్యోగం, ఉపాధిలేమి, వెనుకబాటు తనంతో ప్రజలు అల్లాడుతుండగా, భయకంపితులను చేసే కేన్సర్‌ వ్యాధి ఈ జిల్లా ప్రజలను వణికిస్తోంది.

విశాఖపట్నంలోని వివిధ ఆస్పత్రులలో కేన్సర్‌ చికిత్సపొందుతున్న రోగులలో 40 శాతం శ్రీకాకుళం జిల్లా వాసులే ఉన్నారు. నోటి , రొమ్ము, గర్భాశయ కేన్సర్‌ జిల్లాలో ఎక్కువ మందిని పట్టిపీడిస్తోంది. ఆస్పత్రులకు వచ్చే రోగులలో అత్యధికులు ఇలాంటి కేన్సర్‌తోనే బాధపడుతున్నారు. జీవన విధానంలో పెనుమార్పులు రావటం, చిన్న వయస్సులోనే వివాహాలు కావటం ఈ వ్యాధికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. 

వ్యాయామంతో కేన్సర్ కు చెక్

కేన్సర్‌.. ఒకప్పుడు ఇది సినిమాల్లోనో, నవలల్లోనో పాత్రలకు వచ్చే వ్యాధి! ప్రత్యేకించి మనదేశంలో కేన్సర్‌ బాధితుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో కేన్సర్‌ బారిన పడుతున్నవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అయితే.. మన జీవనశైలిలో కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా కేన్సర్‌ను నిరోధించే అవకాశం ఉందని ‘ద వరల్డ్‌ కేన్సర్‌ రిసెర్చ్‌ ఫండ్‌’ పరిశోధకులు చెబుతున్నారు.

ధూమపానం, మద్యపానం మానేసి, కేరట్‌ తినడం దగ్గర్నుంచీ.. వ్యాయామం చేయడం, ఇంటి పనులు చేసుకోవడం దాకా ఏడు పనులు చేస్తే చాలావరకూ కేన్సర్‌ను నిరోధించవచ్చంటున్నారు. కేన్సర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరల్డ్‌ కేన్సర్‌ రిసెర్చ్‌ ఫండ్‌ ఐ కెన్‌ పేరిట ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తమ పేరు నమోదు చేసుకున్నవారికి కేన్సర్‌ బారినపడకుండా జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులపై రోజుకో చిట్కా చొప్పున 21రోజులు పంపుతారు. ఆసక్తి ఉంటే www.wcrf-uk.org/uk/preventing-cancer సైట్‌లో ఈమెయిల్‌ వివరాలు ఇవ్వొచ్చు. 

Sunday 15 May 2016

కడుపునొప్పితో అండాశయ కేన్సర్

కడుపు నొప్పి అనగానే జీర్ణాశయ సంబంధితమైన సాధారణ సమస్యే అనుకుంటాం కానీ, కేన్సర్‌ లక్షణంగానో, మరే వ్యాధి లక్షణంగానో అనుకోము కదా! అయితే కొన్నిసార్లు ఆ నొప్పి అండాశయంలో వచ్చే కే న్సర్‌ వల్ల కూడా రావచ్చు. నిజానికి, కేన్సర్‌ తొలిదశలో ఉన్నప్పుడు ఏ ఒక్క లక్షణమూ కనిపించదు. ఒకవేళ ఏవైనా కనిపించినా అవి ఫలానా వ్యాధి లక్షణాలంటూ గుర్తించలేని విధంగా ఉంటాయి.

ఎందుకంటే చాలా రకాల వ్యాధి లక్షణాలు ఒకేలా ఉంటాయి. మలబద్ధకం, వెన్నునొప్పి వంటి లక్షణాలను ఎవరైనా సాధారణ సమస్యగానే అనుకంటారు తప్ప మరేదో ప్రాణాంతక వ్యాధి లక్షణమని ఎందుకనుకుంటారు. ముందు అలా ఎవరైనా ఇది ఫలానా వ్యాధి లక్షణం అనుకుంటే అది మరో వ్యాధి లక్షణంగా ఆ తర్వాత బయటపడుతుంది.

మొబైల్ తో కేన్సర్ రాదట

మొబైల్‌ వాడకానికి, మెదడు కేన్సర్‌ ముప్పునకు మధ్య ఎలాంటి సంబంధమూ లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. బ్రెయిన్‌ కేన్సర్‌ బాధితులను సుదీర్ఘకాలంపాటు పరిశీలించి ఈ విషయాన్ని కనుగొన్నట్లు తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్నపుడు వెలువడే రేడియోధార్మికత మెదడు కేన్సర్‌కు కారణమవుతోందని పరిశోధకుల నమ్మకం.

ఇందులోని నిజానిజాలను వెలికితీసేందుకు మెల్బోర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు 20వేల మంది పురుషులు, 14వేల మంది మహిళలపై అధ్యయనం నిర్వహించారు. ఈ వలంటీర్లందరూ బ్రెయిన్‌ కేన్సర్‌ బాధితులేనని వారు తెలిపారు. బాధితుల అనారోగ్యాన్ని, వారి మొబైల్‌ వాడకాన్ని 30 ఏళ్లపాటు పరిశీలించిన తర్వాత బ్రెయిన్‌ కేన్సర్‌ను మొబైల్‌ మరింత పెంచుతోందనేది అపోహేనని తేలిందన్నారు.

Saturday 14 May 2016

లివర్ కేన్సర్‌కు పవర్‌ఫుల్ వైద్యం

 శరీరంలోని కీలక అవయవాల్లోకెల్లా అతి పెద్దది, అతి ముఖ్యమైనది కాలేయం. ఆ అవయవమే కేన్సర్ బారిన పడితే? ఒకప్పుడైతే ఇది కలవరపెట్టే విషయమే. కానీ, ఆధునిక వైద్య విధానాలు ప్రవేశించాక ఇప్పుడా సమస్య మునుపటిలా కలవరపెట్టే అంశం కాకుండా పోయింది. ప్రత్యేకించి సర్జరీలోనూ, కీమో, రేడియేషన్ థెరపీల్లో వచ్చిన ఆధునిక రీతులు కాలేయ సంబంధమైన కేన్సర్‌ను అధిగమించడం సులభతరం చేశాయి. కాకపోతే, లివర్ కేన్సర్ అనగానే డిప్రెషన్‌లోకి జారిపోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి, విధిగా వైద్య చికిత్సలు తీసుకుంటే లివర్ కేన్సర్ నుంచి సంపూర్ణంగా విముక్తి పొందడం సాధ్యమేనంటున్నారు కేన్సర్ వ్యాధి నిపుణులు.


లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రైమరీస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రైమరీ లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రైమరీ లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.

మిస్ తో కేన్సర్ నిర్మూలన


ఔషధాలకు నయం కాని ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అసవరం అవుతున్నాయి. శస్త్రచికిత్సల ద్వారా దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తున్నారు. ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో అటు సర్జన్స్ కు, ఇటు రోగులకు సౌలభ్యమైన సర్జరీ పద్ధతులు ఎన్నో వచ్చాయి. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలకు కూడా చిన్న శస్త్రచికిత్సలతో వైద్యం అందిస్తున్నారు. తక్కువ కోతల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. భయపెట్టే కేన్సర్‌ వ్యాధి చికిత్సకు ఆశాదీపంగా తక్కువ కోతల శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటివరకు ఎండో స్కోపిక్‌, కీహౌల్‌ సర్జరీల ద్వారా వైద్యచికిత్స అందేది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తక్కువ కోతల శస్త్రచికిత్స (minimally invasive surgery symposium(MISS) కేన్సర్‌ కణజాలాన్ని సమర్థవంతంగా తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కేన్సర్‌కు చికిత్స జరుగుతున్న సమయంలో కణజాలం దెబ్బ తింటుంది. నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. ఇదిలా ఉండగా తక్కువ కోతల శస్త్రచికిత్స ఈ చికిత్స విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలిచింది. 

Friday 13 May 2016

తీపి పానీయాలతో కేన్సర్‌ ముప్పు


నడివయసు వచ్చిన వారు ముఖ్యంగా మహిళలు ఆరోగ్య పరమైన తీవ్ర సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.పీరియడ్స్‌ నిలిచిపోయే దశలో ఉన్న మహిళలలోఈ ఇబ్బంది మరింత అధికమని ఇటీవల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తీపిగా ఉండే పానీయాలు, కార్బొనేటెడ్‌ సోడా ఎక్కువగా తీసుకొనే ఈ తరహా మహిళల్లో కేన్సర్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుందని అమెరికన్‌ వైద్య పరిశోధకులు నిర్ధారించారు. మిగిలిన మహిళలతో పోల్చుకుంటే తీయని పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో కేన్సర్‌ వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుందం టున్నారు.


                                అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ వారి కేన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌, ప్రివెన్షన్‌ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం తీపి పానీయాలు తీసుకునే నడివయసు మహిళల్లో ఈ సమస్య 70శాతం వరకూ సంభవించే అవకాశం ఉందని తేలింది. టైప్‌-1 ఎండోమెట్రియల్‌ కేన్సర్‌తోపాటు స్థూలకాయం సమస్య తలెత్తుతాయని, సాధారణ మహిళల్లో కన్నా వీరిలో 50శాతానికి పైగా ఎక్కువ అవకాశం
ఉంటుందని పరిశోధకులు తేల్చారు. దాదాపు 23వేల మంది నడివయసు ముఖ్యంగా పీరియడ్స్‌ ఆగిపోయే దశలో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం ఆధారంగా ఈ పరిశీలనలు చేశారు. 

గర్భాశయ కేన్సర్ తో జరభద్రం


ప్రపంచంలో మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్ తర్వాత  గర్భాశయ కేన్సర్ తోనే బాధపడుతున్నారని సర్వేలో తేలింది. ముఖ్యంగా అమెరికాలో ప్రతి ఐదుగురు మహిళల్లలో ఒకరు గర్భాశయ కేన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నట్లు బయటపడింది. అసలు గర్భాశయ కేన్సర్ ఎందుకు వస్తుంది. రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చనే విషయాలపై ఎన్నో సందేహాలున్నాయి.

    గర్భాశయ కేన్సర్ రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం నుంచి ఎక్సర్ సైజ్ వరకు అన్నింటిలోనూ జాగ్రత్త వహించాలంటున్నారు. సింపుల్ చిట్కాలతో గర్భాశయ కేన్సర్ కు దూరంగా ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఆకుకూరలు, క్యారెట్, టమాటా వంటి కెరోటిన్, లైకోపీన్ వంటి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

Tuesday 10 May 2016

చికెన్ తో చిక్కులే

చికెన్‌ తింటాం…చాలా బాగుంటుంది. మంచిగా వండితే దీనంతటి రుచికరమైన కూర ఇంకొకటి లేదుమరి! అయితే చికెట్‌ తింటే కేన్సర్‌ వచ్చే ప్రమాదముందని మీకు తెలుసా? ఇది నిజం! చికెన్‌ తింటే కేన్సర్‌ అనేది ఏదో ఒక రూపేణా వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి. దానికి కారణమేమిటేంటే, కోడిమాంసంలో కేన్సర్‌ వ్యాధికి కారకమయ్యే ఆర్సనిక్‌ అనే విషపూరితమైన రసాయనం వుంటుంది. ఈ రసాయనమే కేన్సర్‌కు కారణమవుతుంది.


ప్రపంచంలో చికెన్‌ తినేవాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. భారత్‌లో 10 శాతం మినహాయిస్తే దాదాపు అందరూ చికెన్‌ తింటారు. ఆర్సనిక్‌ అనేది ఒక విషపూరితమైన రసాయన పదార్థం. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి కోడిలోనూ ఇది కచ్చితంగా వుంటుంది. ఎందుకంటే ఈ కోళ్ళు స్పీడ్‌గా ఎదగడానికి ఇచ్చే మందులతో ఆర్సనిక్‌ మరింత శక్తివంతమవుతుంది. చికెన్‌లో వుండే ఈ ఆర్సనిక్‌ రసాయనం వల్ల కేన్సర్‌ వస్తుందని 2006లోనే ఐఎటిపి ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఎఫ్‌డిఎ దీన్ని అంగీకరించలేదు. ఎన్నో ఏళ్ళుగా దీనిపై తర్జనభర్జనలు జరుగుతూవచ్చాయి. చివరకు ఎఫ్‌డిఎ కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. 

కలుపు మందుతో కేన్సర్

గ్లైఫొసేట్.. ఇది అత్యంత ప్రభావశీలి అయిన కలుపు మందు. ప్రపంచంలో వాడుకలో ఉన్న కలుపునాశిని రసాయనాల్లోకెల్లా అగ్రగామి. దీన్ని వాడని దేశం లేదు. ఇది మన దేశంలోనూ విరివిగా వాడుతున్న కలుపు మందు కూడా. ఇది సురక్షితమైన కలుపు మందుగా పరిగణించబడినది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కేన్సర్ కారకంగా గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం మొదలైంది. నెదర్లాండ్స్ దీనిపై వెంటనే నిషేధం విధించింది. మరికొన్ని దేశాలు ఇదే బాటను అనుసరించే దిశగా పయనిస్తున్నాయంటున్నారు.

వ్వవసాయంలో కూలీల కొరత ముంచుకొస్తున్నకొద్దీ గ్లైఫొసేట్ గడ్డి మందు వాడకం బాగా పెరిగింది. గ్లైఫొసేట్ అంతర్వాహక చర్య కలిగిన ప్రభావశీలమైన కలుపు నాశక రసాయనం. ఈ కలుపు మందు చెట్టు మీద పడిన వెంటనే మొక్కల శిఖర భాగాలకు.. అంటే నేలలోని పీచు వేళ్ల నుంచి, చిటారు కొమ్మల చిగుళ్ల దాకా చేరుతుంది. చెట్టుకు అత్యంత ఆవశ్యకమైన అమైనో ఆమ్లాల తయారీని అడ్డుకొని కొన్ని రోజులకు పూర్తిగా చంపేస్తుంది.

Monday 9 May 2016

కడుపు నొప్పితో అండాశయ కేన్సర్

కడుపు నొప్పి అనగానే జీర్ణాశయ సంబంధితమైన సాధారణ సమస్యే అనుకుంటాం కానీ, కేన్సర్‌ లక్షణంగానో, మరే వ్యాధి లక్షణంగానో అనుకోము కదా. అయితే కొన్నిసార్లు ఆ నొప్పి అండాశయంలో వచ్చే కే న్సర్‌ వల్ల కూడా రావచ్చు. నిజానికి, కేన్సర్‌ తొలిదశలో ఉన్నప్పుడు ఏ ఒక్క లక్షణమూ కనిపించదు. ఒకవేళ ఏవైనా కనిపించినా అవి ఫలానా వ్యాధి లక్షణాలంటూ గుర్తించలేని విధంగా ఉంటాయి.



    కడుపులో అసౌకర్యంగా లేదా నొప్పిగా ఉండడం. కడుపు నిండినట్లుగా గానీ, బిగదీసినట్టుగా గానీ ఉండడం. లేదా కడుపులో వాపు కనిపించడం. ఏ కొంచెం తిన్నా, కడుపు నిండినట్లుగా ఉండడం. తీవ్రమైన మలబద్ధకంగానో, లేదా తరుచూ మూత్రం రావడం. ఏ ఇతర కారణాలూ లేకుండానే వెన్నునొప్పి రావడం వంటి లక్షణాలు అండాశయ కేన్సర్లో కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒక లక్షణం కనిపించినా, ఆ లక్షణం రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నా, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

బ్రెస్ట్ కేన్సర్ కేపిటల్ బెంగళూరు

గార్డెన్ సిటీ, ఫ్యాషన్ సిటీ అంటూ ముద్దుగా పిలుచుకునే బెంగళూరు నగరం ప్రస్తుతం మరో పేరును కూడా తన జాబితాలో చేర్చేసుకుంది. అదే బ్రెస్ట్ కేన్సర్ రాజధాని. అవును బెంగళూరు నగరంలో బ్రెస్ట్ కేన్సర్ కూడా వేగంగా విస్తరిస్తూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్కు అనుబంధంగా నడుస్తున్న పాపులేషన్ బేస్డ్ కేన్సర్రిజిస్ట్రీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. భారతదేశంలోని మొత్తం 11 ప్రముఖ నగరాల్లో ఈ సర్వేను నిర్వహించగా మొదటి స్థానంలో బెంగళూరు నిలిచింది.






బెంగళూరు నగరంతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, భోపాల్, తిరువనంతపురం, చెన్నై, నాగపూర్, కోల్కత్తా, కొల్లం, పూణె నగరాల్లో పీబీసీఆర్ సంస్థ సర్వేను నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం బెంగళూరు నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 36.6బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జాబితాలో 35.1బ్రెస్ట్ కేన్సర్ కేసులతో తిరువనంతపురం రెండో స్థానంలో ఉండగా, 32.6 కేసులతో చెన్నై మూడో స్థానంలో, 23.3 కేసులతో పూణె చివరి స్థానంలో ఉంది.

Saturday 7 May 2016

ఏపీలో పెరుగుతున్న కేన్సర్ కేసులు

ఏపీలో కేన్సర్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. కేన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే కేన్సర్‌ కేసులు గ్రామాల్లో, మహిళల్లో ఎక్కువగా నమోదు కావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.


జాతీయ స్థాయిలో కూడా పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కేన్సర్‌ కేసులు అధికం. అదే సమయంలో జాతీయస్థాయిలో పట్టణ ప్రాంతాల్లోనే కేన్సర్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. వివిధ వ్యాధులకు సంబంధించి జాతీయ స్థాయిలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్వహించిన నమూనా సర్వేలో తేలిందిది.

ఛాతీ మంట కేన్సర్ కావచ్చు

ఛాతీలో మంట వస్తే అదేదో గ్యాస్ట్రిక్ సమస్య అయి ఉంటుందిలే అనుకుని నిర్లక్ష్యంగా ఉండిపోయే వాళ్లే ఎక్కువ. కానీ, పోను పోను అది గుండెపోటు రావడానికి దారి తీసే లక్షణం కూడా కావచ్చనే అవగాహన కొంత మందికి కలిగింది. అయితే, ఈ రెండూ కాకుండా ఛాతీ మంట, కేన్సర్‌ రావడానికి ముందస్తు పరిస్థితి కూడా కావచ్చనే నిజం ఇటీవల వెలుగు చూసింది.


కొందరిలో బేరెట్స్‌ ఈసోఫేగస్‌ అనే ఒక సమస్య తలెత్తుతుంది. ఇది నోటికీ పొట్టకూ మద్యనుండే ఒక వాహిక లోని అంతర పొరలోని కణజాలం దెబ్బ తినడం వల్ల ఏర్పడే పరిణామం. ఈసోఫేగస్‌ కేన్సర్‌ రావడానికి ముందు కొందరిలో కనిపించే లక్షణమిది. అయితే, అమెరికాలోని ఫ్రెడ్‌ హచిన్‌సన్‌ కేన్సర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లోని పరిశోధకులు బేరెట్‌ సంబంధిత కేన్సర్లు రావడానికి గల అతితీవ్రమైన కొన్ని ఇతర కారణాలను కూడా కనుగొన్నారు? వాటిలో వయసు పైబడటం, సిగరెట్లు తాగిన గతచరిత్ర, పొట్టలో కొవ్వు పెరగడం ప్రధానంగా కనిపించాయి.
అందువల్ల ఇలాంటి సమస్యలనుంచి ఉపశమనం పొందడానికి ఇప్పటిదాకా సొంతవైద్యానికే పరిమితమై ఉన్నవాళ్లు, వెంటనే ఒక నిపుణుడైన డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

Friday 6 May 2016

కేన్సర్ కీమోథెరపీకి ప్రత్యామ్నాయం

కేన్స‌ర్ ట్రీట్ మెంట్ లో కీమోథెర‌ఫీ అనేది అత్యంత కీల‌క‌మైనది. కేన్స‌ర్ క‌ణాల‌ను న‌శింప‌జేయ‌డానికి డాక్ట‌ర్లు చేసే ఈ ట్రీట్ మెంట్ నెల‌లు త‌ర‌బ‌డి చెస్తుంటారు. ట్రీట్ జ‌రుగుతున్నంత కాలం ఆ మ‌నిషి ప‌డే బాధ వ‌ర్ణ‌నాతీతం. వాస్త‌వానికి కీమోథెర‌పీకి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను శాస్ర్త‌జ్ఞలు ఎప్ప‌టి నుంచో అన్వేషిస్తున్న‌ప్ప‌టికి స‌రైన ఫలితాలు రావ‌డం లేదు. అయితే తాజాగా లుకేమియా చికిత్స లో వాడే ఇబ్రుటినిబ్, ఇడిలాలిసిబ్ అనే రెండు ర‌కాల మందులు కేన్స‌ర్ చికిత్స‌కు మెరుగైన ఫ‌లితాల‌ను అందిస్తున్నాయ‌ని తాజా అధ్య‌య‌నంలో తెలిసింది.

ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న వారికి మ‌రికొంత కాలం జీవించే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. కీమోథెర‌పీకి బ‌దులుగానే కాకుండానే మూల క‌నాల మార్పిడి ప్ర‌క్రియ‌లోనూ ఈ కైనేజ్ ఇన్‌హిబిటార్స్ తరగతికి చెందిన ఇబ్రుటినిబ్, ఇడిలాలిసిబ్ డ్ర‌గ్స్ బాగా ప‌నిచేస్తున్నాయ‌ని గుర్తించారు. ఈ విధానంలో చికిత్స తీసుకున్న‌వారు జీవితం కాలం ఒక‌టి నుంచి రెండేళ్లు పెరుగుతున్న‌ట్లు తెలిపారు. అయితే ఈ రెండు డ్ర‌గ్స్ ను క‌లిపి వాడితే ఎలా ఉంటుంద‌న్న అంశంపై ప్ర‌స్తుతం ప‌రిశోద‌న ప్రారంభించిన‌ట్లు వియాన్న జ‌న‌ర‌ల్ హ‌స్పిటల్ కు చెందిన ఉల్రిచ్ జ‌గ‌ర్ తెలిపారు.

వాయు కాలుష్యంతో కేన్సర్ ముప్పు



వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది.


మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.

Thursday 5 May 2016

బంగాళాదుంపలతో జీర్ణాశయ కేన్సర్‌ దూరం


కూరగాయలతో కేన్సర్ ముప్పు నుంచి జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆలు గడ్డలతో జీర్ణాశయ కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని వారు వెల్లడించారు. బీజింగ్‌లోని జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

ముఖ్యంగా పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుందని, వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి జీర్ణాశయంలో ఒత్తిడిని తీవ్రంగా తగ్గిస్తుంది చెప్పారు. ప్రధానంగా ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో ఈ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

గర్భాశయ కేన్సర్ కు ముందుచూపుతో చెక్

ప్రపంచంలో మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్‌ తర్వాత గర్భాశయ కేన్సర్‌ తోనే బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అమెరికాలో ప్రతీ 5గురు మహిళల్లో ఒకరు గర్భాశయ కేన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నట్లు బయటపడింది. అసలు గర్భాశయ కేన్సర్‌ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నదానిపై రకరకాల సందేహాలు కలగవచ్చు.





డాక్టర్లు ఏం చెబుతున్నారంటే….. గర్భాశయ కేన్సర్‌ రాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు. మనం తీసుకునే ఆహారం నుంచి ఎక్సర్‌ సైజ్‌ వరకు అన్నింటిలోనూ జాగ్రత్త వహించాలంటున్నారు. సింపుల్‌ చిట్కాలతోనే గర్భాశయకేన్సర్ కి దూరంగా ఉండవచ్చంటున్నారు.
డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆకుకూరలు, క్యారెట్‌, టమోటా వంటి కెరోటిన్‌, లైకోపీన్‌ వంటి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి.


Wednesday 4 May 2016

జన్యుమార్పులతో కేన్సర్ ఛాన్స్

 జన్యువులలో వంశపారంపర్యంగా వచ్చే పరివర్తనాలు 12 రకాల కేన్సర్లకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుపరమైన మార్పులతో కేన్సర్‌ వస్తుందనే విషయం గతంలోనే వెల్లడైంది. అయితే, ఈ పరివర్తనాలు అకస్మాత్తుగా రావడం లేదని, తరాల తరబడి వీటి ప్రభావం కొనసాగుతోందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో తరంలో డీఎన్‌ఏలో నిర్ధుష్టంగా జరుగుతున్న మార్పులు చివరకు కేన్సర్‌కు దారితీస్తున్నాయని వివరించారు.

 ప్రధానంగా వీటిలో అండాశయ, స్టమక్‌, రొమ్ము, ప్రోస్టేట్‌, లంగ్‌ (రెండు రకాలు), గ్లియోమా, తల మరియు మెడ, ఎండోమెట్రియల్‌, కిడ్నీ, గ్లియోబ్లాస్టోమా, అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా కేన్సర్లకు కారణం వంశపారంపర్యంగా వచ్చే డీఎన్‌ఏ మార్పులేనని స్పష్టం చేశారు.

జాన్సన్ పౌడర్‌తో గర్భాశయ కేన్సర్

ప్రముఖ టాల్కం పౌడర్ ఉత్పత్తి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి యుఎస్ జ్యూరీ భారీ అపరాధం విధించింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్‌ను వాడిన ఓ మహిళకు ఓవరిన్ కేన్సర్ బారిన పడింది. దీంతో ఈ అపరాధం చెల్లించాల్సిందిగా జ్యూరీ ఆదేశించింది.
 మూడు వారాల పాటు కేసును విచారించిన మిస్సోరీ స్టేట్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అలాగే, బాధిత మహిళకు 5 మిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు.. 50 మిలియన్ డాలర్లు శిక్షాత్మక నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.



Tuesday 3 May 2016

ఆల్కహాల్ తో జీర్ణాశయ కేన్సర్

వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫెడరేషన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 89 పరిశోధనలను నిశితంగా విశ్లేషించి ఓ కొత్త విషయాన్ని నిర్థారించుకున్నట్లు వెల్లడించింది. దాని ప్రకారం.. రోజుకు మూడు, నాలుగు పెగ్గుల మద్యం, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు తీసుకోవడం జీర్ణాశయ కేన్సర్ రిస్క్ ను పెంచుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ రిస్క్ మహిళలతో పోలిస్తే పురుషులలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అలాగే వృద్ధులు దీని బారిన పడటం ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 77 వేల మంది జీర్ణాశయ కేన్సర్ బాధితులను పరిశీలించినట్లు సమాచారం. చివరగా ఈ విషయంలో కాస్త ఆలోచించకపోతే.. పెద్ద ప్రమాదమే ఎదుర్కోవాలని వస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

కీమోథెరపీతో కేన్సర్ కు చెక్

కేన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ మందులకున్న ప్రాధాన్యం తెలిసిందే! సాధారణంగా ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల రూపంలో ఈ మందులను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ పద్ధతిలో మందు కేన్సర్‌ కణితిని చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో దాని ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కీమోథెరపీ మందును నేరుగా కేన్సర్‌ కణితికి చేరవేస్తే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇందుకోసం పేస్‌మేకర్‌ తరహాలో శరీరంలోకి ప్రవేశపెట్టే పరికరాన్ని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశా రు. దీని సాయంతో పాంక్రియాటిక్‌ కేన్సర్లలో పెరిగిన కణితిని కుచించుకు పోయేలా చేయవచ్చన్నారు. ఆపై శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చని ఎంఐటీకి చెందిన లారా ఇండోల్ఫి తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో తాజా ఆవిష్కరణతో 12 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు లారా వివరించారు.