నవంబర్ ను పాంక్రియాటిక్ కేన్సర్ మంత్ గా పాటిస్తున్నారు. పాంక్రియాజ్, స్టమక్ కేన్సర్ లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తే ముందు జాగ్రత్త పడటం తేలికౌతుంది. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. డైటింగ్, వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గుతున్నట్లయితే ఫర్వాలేదు. కానీ ఆహారపు అలవాట్లు మార్చుకోకుండానే, ఏ కారణం లేకుండానే బరువు తగ్గుతున్నట్లయితే అనుమానించాల్సి ఉంటుంది. పాంక్రియాజ్, స్టమక్ వంటి కేన్సర్‌లలో బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఎంతకీ విడవని జ్వరం లింఫోమా, ల్యుకేమియా వంటి బ్లడ్‌కేన్సర్‌లకు సంకేతం కావచ్చు. కాబట్టి జ్వరం తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకవేళ అది కేన్సర్ కాకపోయినా జ్వరం తగ్గేవరకు చికిత్స తీసుకోవడం మరువద్దు.
నొప్పికి చాలా కారణాలుంటాయి. అయితే వదలకుండా ఉన్న తలనొప్పి బ్రెయిన్ కేన్సర్ సంకేతం కావచ్చు. నడుంనొప్పి రెక్టల్, ఒవేరియన్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. ఒకవేళ విడవకుండా నొప్పి ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి కారణం తెలుసుకోండి. చాలా రోజులుగా దగ్గు బాధిస్తోందా? అది లంగ్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. సీజనల్ అలర్జీ వల్ల వచ్చిన దగ్గు కావచ్చు. కారణం ఏదైనా పరీక్ష చేయించుకోవడం మాత్రం మరువద్దు. శరీరంలో ఎక్కడైనా గడ్డల మాదిరిగా తగిలితే నిర్లక్ష్యం పనికిరాదు. బ్రెస్ట్, టెస్టికల్స్, లింఫ్ నోడ్స్ దగ్గర గడ్డల మాదిరిగా ఉంటే పరీక్ష చేయించడం ఉత్తమం. అబ్‌నార్మల్ బ్లీడింగ్ కేన్సర్‌కు సంకేతం కావచ్చు. దగ్గినపుడు కఫంలో రక్తం పడటం, మలంలో రక్తం పడటం, మూత్రంతో పాటు రక్తం రావడం, వెజైనల్ బ్లీడింగ్ వంటివి కేన్సర్‌కు సంకేతాలు. ఒకవేళ పుండు ఎంతకీ తగ్గకుండా ఉన్నట్లయితే డాక్టర్‌తో చెక్ చేయించుకోవాలి. నోట్లో పుండ్లు ఉన్నా ఓరల్ కేన్సర్ లక్షణం కావచ్చు. ఒకవేళ పుట్టుమచ్చల్లో ఏమైనా మార్పులు కనిపించినా, చర్మంపై ఇతర మార్పులు కనిపించినా మెలనొమాకు సంకేతం కావచ్చు. కాబట్టి డెర్మటాలజిస్టును కలవాలి. ఎప్పుడూ నీరసంగా ఉండటం కూడా కేన్సర్ సంకేతం కావచ్చు. చాలా మందిలో వివిధ కారణాల వల్ల నీరసం ఉంటుంది. ఒకవేళ రోజంతా నీరసంగా ఉన్నట్లయితే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
No comments:
Post a Comment