Sunday, 13 November 2016

కొన్నేళ్ల ముందే కేన్సర్ గుర్తించొచ్చా..?

ప్రస్తుతం మహమ్మారిగా మారిన కేన్సర్‌ రావచ్చని దాదాపు పదేళ్ల ముందే గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త రక్త పరీక్ష త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డీఎన్‌ఏకు సంబంధించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మన శరీరంలో టెలోమెర్స్‌ అనే చిన్న చిన్న ఆకారాలు ఉంటాయి. వాస్తవానికి, మన షూ లేస్‌కు చివర్లో ప్లాస్టిక్‌ మూతలా ఒకటి ఉంటుంది కదా! అలాగే, మన క్రోమోజోములకు చివర్లో మూతలా ఈ టెలోమెర్స్‌ ఉంటాయి. క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ పాడవకుండా అది కాపాడుతుంది. షూ లేస్‌ చివర్లోని ప్లాస్టిక్‌ పోయిందనుకోండి.. ఇక లేస్‌ అంతా పాడవుతుంది కదా! అలాగే, టెలోమెర్స్‌ పాడయితే క్రోమోజోముల్లోని డీఎన్‌ఏ కూడా దెబ్బతింటుంది.


                 ఇక, మనకు వయసు పెరుగుతున్నకొద్దీ ఈ టెలోమెర్స్‌ చిన్నవి అవుతూ ఉంటాయి. దాంతో మన డీఎన్‌ఏ కూడా పాడవుతూ వస్తుంది. తద్వారా, వయసుతోపాటు వచ్చే అల్జీమర్స్‌, డయాబెటిస్‌, గుండెపోటు వంటి వ్యాధులు వస్తాయి. ఈ టెలోమెర్స్‌ కనక సాధారణం కంటే చిన్నవి అయిపోయాయనుకోండి. అది అనారోగ్యానికి, మరణానికి చేరువ అవుతున్నారనడానికి సంకేతం అన్నమాట. ఇప్పుడు, టెలోమెర్స్‌ పొడవులో మార్పులను బట్టి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందా లేదా అనే విషయాన్ని కనుగొనవచ్చని నార్త్‌వెస్టర్న్‌ అండ్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటి పొడవులో భారీగా మార్పులు వచ్చేస్తే.. అంటే చిన్నవి అయిపోతే, అతనికి కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని చాలా ఏళ్లకు ముందుగానే గుర్తించవచ్చని వివరిస్తున్నారు.

No comments:

Post a Comment