కేన్సరు అనేది కొత్త వ్యాధికాదు. పురాతనకాలంలో దీన్ని రాచపుండు అని అనేవారు. అయితే సామాన్యులకు కాక రాజులకే ఎందుకు వస్తుంది? బహుశా రాజుల భోగలాలస జీవితం వలనేమో. ఇంకొకటైనా కావచ్చు. రాజులకొస్తే అది ప్రజలందరికీ వార్తా విశేషం, కాని సామాన్య పౌరుడికొస్తే ఎవరు పట్టించుకుంటారు. అదలా వుంచితే, కేన్సర్ అనే పదానికి గ్రీకులో యెండ్రకాయ లేదా పీత అని అర్థం. పీతకు ఎలా అయితే శరీరం మధ్యనుండి నలువైపులా విస్తరించినట్లు కాళ్ళు ఉంటాయో, కేన్సరు అదే పద్ధతిలో వ్యాప్తిచెందటం వలన దానిని కేన్సరు గా నామకరణం చేసారు. కర్కాటక రాశిని ఆంగ్లంలో కేన్సర్ అంటారు, దాని రాశిగుర్తు పీత. హిప్పోక్రేట్స్ అనే గ్రీకు తత్వవేత్త దీన్ని కార్కినోమా అని వర్ణించాడు. ఈ పదాన్నే ఆంగ్లంలో కార్సినోమా అంటారు.
నిద్రాణంగా వున్న వికృత కణాలకు సరియైన కేన్సరు ప్రేరకాలు పురికొల్పడం వలన అవి విపరీతంగా స్పందించి అసందర్భ కణ విభజనకు లోనవుతాయి. ఇటువంటి కణ విభజనను ప్రొలిఫిరేషన్ అంటారు. కొవ్వు పదార్థాలు , అత్యధికమైన కేలరీలు ఈ నిద్రాణమైన కణాలను స్పందింపజేసి వాటిని అనియంత్రితంగా విభజన చెందించి, కణజాల పరిమాణాన్ని పెంచి ముందుగా వాపు లా కనిపిస్తాయి. వీటి పరిమాణం ఇంకాపెరిగినాక దీన్నే ట్యూమర్ లేదా కంతి అంటాం. ఎక్కువ శాతం కేన్సర్లు రసాయన పదార్థాలు మనశరీరం లో చేరిన తరువాత సంభవిస్తాయి.మొత్తానికి మనకు జన్యు-పర్యావరణల పరస్పర సంబంధం వలన ఎక్కువగా కేన్సర్లు వస్తాయి అని చాల పరిశోధనలవలన తెలిసింది.
No comments:
Post a Comment