Thursday, 21 June 2018

గ్రీన్ టీ తో కేన్సర్ దూరం



గ్రీన్‌ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు.  భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్‌ డాట్‌ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్‌ సెల్స్‌ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్‌ చికిత్సలోనూ, యాంటీబయాటిక్‌ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్‌ డాట్స్‌ ఉపయోగపడుతున్నాయి.



ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్‌ డాట్‌ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్‌ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్‌ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్‌ డాట్స్‌ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్‌ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్‌ డాట్స్‌ను కేన్సర్‌ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 

No comments:

Post a Comment