Monday, 7 March 2016

నేటి మహిళ.. మేటి శక్తి

మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతటి ప్రాధాన్యతల గల 8వ తేదీ ముంగిట్లో... మార్కెట్‌ యుగంలో మహిళ స్థితిగతులను పరిశీలిద్దాం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది.

యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.

మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసాపు చివరి ఆదివారం నాడు రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకు పైగా సైనికులు మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కేన్సర్ ను జయించిన మహిళలు
----------------------------------
మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోవడమే కాకుండా.. ప్రాణాంతకమైన వ్యాధుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని బాధిస్తున్న కేన్సర్ ను కొందరు సెలబ్రిటీలు జయించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
. బాలీవుడ్ బ్యూటీ లీసారే 2009లో కేన్సర్ బారిన పడింది. కొన్నాళ్ల పాటు కేన్సర్ తో పోరాడాక.. లీసారే ఆరోగ్యాన్ని సంతరించుకుంది. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ట్రీట్ మెంట్ ద్వారా కేన్సర్ నుంచి బయటపడినట్లు.. 2010లో లీసారే ప్రకటించింది. అప్పట్నుంచి కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. 

. అలనాటి బాలీవుడ్ తార ముంతాజ్ కూడా క్యాన్సర్ తో పోరాడినవారే. యాభై నాలుగేళ్ల వయసులో కేన్సర్ సోకిన ముంతాజ్.. బ్రెస్ట్ కేన్సర్ పై విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్, కీమో, రేడియేషన్ చికిత్సలు చేయించుకున్న ముంతాజ్.. ఆ నేపథ్యంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను అధిగమించారు. 2010లో కేన్సర్ సర్వైవల్స్ పై యూనిగ్లోబ్ ఎంటర్ టైన్ మెంట్స్ తీసిన డాక్యుమెంటరీలో ముంతాజ్ కనిపించారు. 

. నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా కూడా కేన్సర్ ను జయించినవారే. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరించిన మనీషా.. 42 ఏళ్ల వయసులో కేన్సర్ బారిన పడ్డారు. న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మనీషా.. కీమోథెరపీ సమయంలో తన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించారు. కీమోథెరపీ కారణంగా హెయిర్ లాసైనా.. మనీషా ధైర్యంగా పోరాడారు. కేన్సర్ ను ఓడించిన తర్వాత.. తన మునుపటి రూపు సంతరించుకున్న మనీషా.. అప్పట్నుంచి కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  

. హాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ఏంజెలీనా జోలీకి కూడా బ్రెస్ట్ కేన్సర్ సోకింది. బ్రెస్ట్ , ఒవేరియన్ కేన్సర్ బారిన పడకుండా తాను ఆపరేషన్ చేయించుకున్నట్లు ఏంజెలీనా ధైర్యంగా ప్రకటించారు. హాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరున్న ఏంజెలీనా.. తన తల్లి నుంచి తనకు కేన్సర్ సోకుతుందని తెలియగానే.. డబుల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు. కేన్సర్ ను నివారించడం ద్వారా ఏంజెలీనా.. మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు. 

. గాయనిగా, నటిగా అందరికి సుపరిచితురాలయిన మళయాళ భామ మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఓ సారి క్యాన్సర్ నుండి కోలుకున్న ఆమె తిరిగి మళ్లీ క్యాన్సర్ బారిన పడింది. ఇప్పుడు కోలుకుంది. ఇటీవలె భర్త నుండి విడాకులు కూడా తీసుకున్న మమతా మోహన్ దాస్ సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుని తాను స్ట్రాంగ్ గా ఉన్నానని తెలిపింది. కేన్సర్ అనగానే అందరిలా నేను భయపడ్డాను. అది తిరగబెట్టడంతో మరింత భయపడ్డాను. కానీ జీవితంలో ఒక్కో దెబ్బ మనిషిని రాటుదేలుస్తుంది. ఇప్పుడు నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటోంది మమతా మోహన్ దాస్.