Sunday, 4 February 2018

ఇవాళ వాల్డ్ కేన్సర్ డే

కేన్సర్ వ్యాధి సంక్రమించడానికి కారణం ఫలానా అని చెప్పలేకపోవచ్చు కానీ దాన్ని నిరోధించేందుకు మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే వ్యాధిని అడ్డుకోవచ్చని పరిశోధనాల్లో తేలింది. ప్రపంచ కేన్సర్ డే ఫిబ్రవరి 4 సందర్భంగా ఆ వివరాలను తెలుసుకుందాం. ప్రతిరోజూ తినే ఆహారంలో అత్యధిక స్థాయిల్లో ఫైబర్ నిల్వలున్న పదార్థాలను తీసుకునేవారిలో కేన్సర్ వ్యాధి రావడం చాలా తక్కువ. పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. అంతేకాదు ప్రొస్టేట్ కేన్సర్ రాకుండా అడ్డుకోవడంలో పండ్లు, కూరగాయలు కీలక పాత్రను పోషిస్తాయి.

2015లో చైనా పరిశోధనల ప్రకారం తెల్లని కూరగాయలు, బంగాళాదుంపలు, క్యాలీఫ్లవర్ వంటివి తీసుకుంటుంటే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వీటిని తీసుకునేవారిలో వ్యాధి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణాశయ కేన్సర్‌ను కూడా అడ్డుకునే శక్తి వీటికి ఉంది. కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట కాఫీని సేవించేవారిపై చేసిన అధ్యయనంలో 42 శాతం మందికి ఈ వ్యాధి రాకుండా ఉన్నట్లు కనుగొన్నారు. కాఫీ తీసుకోని వారిలో ఈ వ్యాధి 34 శాతం మందికి సోకినట్లు తేలింది. కనుక మోతాదుకు మించని కాఫీ సేవనం ఆరోగ్యానికి మంచిదేనంటున్నారు పరిశోధకులు. రెండు కప్పులకు మించి కాఫీ తాగడం కూడా మరో రకమైన అనారోగ్యాన్ని తెస్తుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.


వారంలో రెండుసార్లు చేపలను తీసుకోవడం వల్ల కేన్సర్ వ్యాధికి చెక్ చెప్పవచ్చంటున్నారు. చేపలు తీసుకునేవారిపై చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ముఖ్యంగా బ్రెస్ట్ కేన్సర్ ను నిరోధించడంలో ఈ ఆహారం కీలక పాత్రను పోషిస్తుందని తేలింది. మరి తినకుండా తప్పించుకోవాల్సిన పదార్థం ఏమైనా ఉన్నదా అంటే... అత్యధిక స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్న పదార్థాలు. వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటిలో కేన్సర్ కూడా ఒకటి. కనుక ఆకలిగా ఉంది కదా అని ప్యాక్ చేసి ఉంచి బిస్కెట్లు, చక్కెర నిల్వలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి.

Wednesday, 3 January 2018

మూత్రపరీక్ష ద్వారా కేన్సర్ గుర్తింపు

శరీరాన్ని కబళించి క్రమంగా ప్రాణాలు తోడేసే కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే చికిత్స ద్వారా బయటపడొచ్చు. దీనికి బోలెడంత శ్రమ, నిరీక్షణ కావాలి. బయాప్సి ద్వారానే కేన్సర్‌ ఎలాంటి స్థితిలో ఉందో...అసలు అది కేన్సరో కాదో తెలుసుకునే వీలుంది. 
ఇకపై అంత శ్రమ అవసరం లేదంటున్నారు జపాన్‌ శాస్త్రవేత్తలు. కేవలం మూత్ర పరీక్ష ద్వారానే కేన్సర్‌ను గుర్తించ వచ్చని చెబుతున్నారు. నానోవైర్‌ పరికరం ద్వారా దీనిని కనిపెట్టవచ్చని జపాన్‌లోని నగోయా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఈ విధానంలో రోగి నుంచి ఒక మిల్లీలీటరు మూత్రం సేకరిస్తే సరిపోతుందని టకాయో తెలిపారు.

Tuesday, 2 January 2018

కేన్సర్.. వర్రీ వద్దుఒకప్పుడు దాని పేరు రాచపుండు. అదే ఇవాళ మనందరికీ తెలిసిన కేన్సర్. మందులకు లొంగని మొండి రోగం అనుకునే రోజులు పోయి. కాన్సర్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. ఈ రంగంలో ఎంతో కృషి చేసి ఎందరికో కేన్సర్ నుంచి  విముక్తి కలిగించారు.  కేన్సర్ కన్నా కేన్సర్ ట్రీట్‌మెంట్ చాలా భయంకరమైందని అపోహలు పడి చాలా మంది చికిత్స తీసుకునే వారు కాదు. ఇప్పుడు కేన్సర్‌కు చాలా రకాలైన నూతన వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
             అందులో వైద్య పద్ధతుల్లో కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రివెల్యూషన్ ఏంటంటే.. కేన్సర్ పేషెంట్‌ని సర్జనో, మెడికల్ ఆంకాలజిస్టో, రేడియేషన్ ఆంకాలజిస్టో కాకుండా ఒక టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్స్ కలిసి చూడాలి. ఇప్పుడు కొత్తగా పెట్ స్కాన్ అందుబాటులోకి వచ్చింది..

Monday, 1 January 2018

బ్లూబెర్రీతో గర్భాశయ కేన్సర్ కు చెక్

గర్భాశయ కేన్సర్‌ నివారణ కోసం చేసే రేడియేషన్‌ చికిత్సకు కేన్సర్‌ కణాలు బాగా స్పందించేలా బ్లూబెర్రీలు ఉపయోగపడుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్లూబెర్రీల సారం రేడియోసెన్సిటైజర్లలా వ్యవహరిస్తాయని, హానికరం కాని ఈ రసాయనం.. కేన్సర్‌ కణాలు రేడియేషన్‌ చికిత్సకు స్పందించేలా చేస్తాయని వెల్లడించారు.


బ్లూబెర్రీలలో రెస్వెట్రాల్‌(ప్రొస్టేట్‌ కేన్సర్‌ను అడ్డుకునే రేడియోసెన్సిటైజర్‌), ఫ్లెవొనాయిడ్స్‌ అనే రసాయనాలు ఉంటాయని, అందులో ఫ్లెవొనాయిడ్స్‌ ప్రతిక్షకారినిలా, శోథ నిరోధకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

Monday, 7 August 2017

బ్లడ్ కేన్సర్ కు కొత్త మందు

లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్. వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది.దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్ అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు.

Sunday, 6 August 2017

కేన్సర్ కు పసుపుతో చెక్

పసుపులో ఔషధ గుణాలున్నాయని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన గుణాన్ని శాస్త్రవేత్తలు పరిశోధించి కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే పసుపు కేన్సర్‌ నిరోధించడానికీ సాయపడుతుందని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఈ బృందంలో భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఉండడం విశేషం. పసుపులో ఉండే కర్కమిన్‌ సాయంతో పసికందులలో వచ్చే కేన్సర్‌ను సమర్థమంతంగా నిరోధించవచ్చట.కాగా, పదేళ్లలోపు చిన్నారులకు ఈ కేన్సర్‌ ముప్పు ఎక్కువ. ఇందులో కణుతులు మందులకు లొంగవని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా మొండి కణుతులే లక్ష్యంగా సూక్ష్మ అణువులను పంపించేందుకు కర్కమిన్‌ తోడ్పడుతుందన్నారు. కణితిని అణిచివేసే సూక్ష్మ అణువులను కర్కమిన్‌కు జతచేసి నేరుగా లక్ష్యానికి చేర్చవచ్చన్నారు. ఇలా ఓ ప్రత్యేక పద్ధతిలో దాడి చేసి కేన్సర్‌ను నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ఏపీలో కేన్సర్ చికిత్స

జిల్లాకు ఒక యూనిట్‌, ప్రాంతానికి ఒక సూపర్‌ స్పెషాలిటీ, ఉన్న దగ్గర ఉన్నతంగా మెరుగులు.. ఏపీ అంతా కేన్సర్‌ వైద్య అవకాశాలను పెద్దఎత్తున పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. రాష్ట్రంలో కేన్సర్‌ వైద్య చికిత్సకు అవకాశాలు తక్కువ. ఉన్నదగ్గర కూడా, ప్రాథమికస్థాయిలోని కేసులకే వైద్యం అందించే వీలుంది.  విజయవాడలో ఈరోజుకీ ఒక్క కేన్సర్‌ సెంటర్‌ కూడా లేదు. విశాఖ, గుంటూరులలో స్టేజ్‌-1 కేసులను చూడగలుగుతున్నారు. దీంతో, అయితే హైదరాబాద్‌ లేదంటే చెన్నై, బెంగళూరుకు రోగులు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో వారికి వారు ఉన్నదగ్గరే పూర్తిస్థాయిలో పరీక్షలు, చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా.. 13 జిల్లాల్లోనూ జిల్లాకు ఒక చొప్పున కేన్సర్‌ యూనిట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.విశాఖ కేజీహెచ్‌లో ఆంకాలజీ విభాగంలో రేడియేషన్‌ థెరపీతో కేన్సర్‌ రోగులకు వైద్యం చేస్తున్నారు. సాధారణ స్టేజ్‌లో ఉన్న రోగులకు మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విభాగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది పక్కా ప్రణాళిక రూపొంచింది. కర్నూలు జిల్లాలో రూ.120 కోట్ల నిధులతో స్టేట్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే ఈ ఆసుపత్రి.. రిఫరల్‌ సేవలు అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కేన్సర్‌ ఆసుపత్రులు, ఓపీ బ్లాక్‌ల నుంచి చివరి దశ రోగులను ఇక్కడకు తరలిస్తారు. ఇక..నెల్లూరు జిల్లాలో రూ. 40కోట్లతో థెర్సికేర్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతుంది. తిరుపతి స్విమ్స్‌లో ఆంకాలజీ విభాగం అద్భుతంగా కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.