Friday, 30 June 2017

కేన్సర్ బీ 17 లోపమా..?కేన్సర్ ఒక భయంకరమైన, ప్రాణాంతక వ్యాధి కాదని, విటమిన్ బి17 లోపమని ఓ విధమైన వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. బి17 విటమిన్ లభించే ఆహారాన్ని తీసుకుంటే చాలు కేన్సర్ కు దూరంగా ఉండవచ్చన్న అధ్యయనాలూ ఉన్నాయి. ఇది నిజమేనా...? అన్న సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మరి ఆ నిజా నిజాలేంటో పలువురు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం తెలుసుకుందాం.


బి1, బి2, బి6, బి12 విటమిన్లు గురించి వినే ఉంటారు...మరి బి17 ఎక్కడి నుంచి వచ్చింది...? నిజానికి విటమిన్ బి17 అంటూ ఏదీ లేదు. అమిగ్డాలిన్ నుంచి రూపొందించే లాట్రిలే అనే ఔషధానికి పెట్టిన నామం బి17. చాలా రకాల మొక్కల్లో లభించే విషపూరిత సైనోజెనిక్ గ్లైకోసైడ్ నే అమిగ్డాలిన్ గా పేర్కొంటారు. ఈ అమిగ్డాలిన్ ను మెరుగుపరిచి లాట్రిలేగా మారుస్తారు. శాస్త్రీయ నామం మాండెలో నైట్రిల్ బీటా డీ జెంటియోబయోసైడ్. దీన్నే నైట్రిలోసైడ్ గానూ భావిస్తారు. ఇది సైనేడ్ ను కలిగి ఉండే సహజ పదార్థం. ఇది శరీరానికి కావాల్సిన కనీస పోషకమేమీ కాదు. హైడ్రోజెన్ సైనేడ్ ను ఉత్పత్తి చేయడం ద్వారా కేన్సర్ విస్తరణను అడ్డుకుంటుందని కొందరు వైద్యులు సొంతంగా పరిశోధనలు చేసి ప్రకటించారు. కానీ, ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ దీన్ని గుర్తించలేదు.

Tuesday, 20 June 2017

యోగాతో అందరికీ ఆరోగ్యం

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.


            బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు.