Saturday, 16 June 2018

విటమిన్ డీ లోపంతో రొమ్ము కేన్సర్

రోజూ  కాసేపు ఎండలో నిలబడితే ఆరోగ్యానికి మేలని మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. శరీరం స్వయంగా తయారు చేసుకోవడం సాధ్యం కాని విటమిన్‌ డీని సూర్య కిరణాలతో చేసుకోవచ్చు. ఎముకల దృఢత్వం మొదలుకొని అనేక సమస్యల పరిష్కారానికి విటమిన్‌ డీ దోహదపడుతుందని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా శరీరంలో విటమిన్‌ డీ ఎక్కువ మోతాదులో ఉంటే రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. విటమిన్‌ డీతో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో కలిపి ఈ అధ్యయనం జరిగింది. దాదాపు అయిదు వేల మందిపై ఇప్పటికే జరిగిన రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ నుంచి  సమాచారాన్ని సేకరించి విశ్లేషించినప్పుడు తమకు ఈ కొత్త విషయం తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.



2002 – 2017 మధ్యకాలంలో జరిగిన ఈ దీర్ఘ అధ్యయనంలో అప్పుడప్పుడూ విటమిన్‌ డీ మోతాదులను పరిశీలించామని, మొత్తమ్మీద చూసినప్పుడు వీరిలో 77 మంది రొమ్ము కేన్సర్‌ బారిన పడ్డారని ఆయన చెప్పారు. కేన్సర్‌బారిన పడని వారిలో విటమిన్‌ డీ మోతాదు 60 నానోగ్రామ్స్‌/లీటర్‌గా ఉన్నట్లు గుర్తించామని.. సాధారణంగా 20 నానోగ్రాముల విటమిన్‌ డీ ఉంటే చాలని వైద్యం చెబుతుందని వివరించారు.

ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్‌ డీ మోతాదును గణనీయంగా పెంచేందుకు అమెరికన్‌ వైద్యరంగం ప్రయత్నాలు చేస్తోంది. అరవై నానోగ్రాముల కంటే ఎక్కువ విటమిన్‌ డీ ఉన్న వారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు.

అధ్యయనంలో పాల్గొన్న వారి వయసు, బాడీ మాస్‌ ఇండెక్స్, ధూమపానం వంటి అలవాట్లు అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పటికీ విటమిన్‌ డీ ఎక్కువగా ఉన్నవారికి రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని తమ అధ్యయనం చెబుతోందని వివరించారు. కొన్ని రకాల ఇతర కేన్సర్ల విషయంలోనూ విటమిన్‌ డీ ప్రభావం ఎంతో ఉన్నట్లు గతంలో జరిగిన పరిశోధనలు చెబుతూండటం ఇక్కడ గమనార్హం.

No comments:

Post a Comment