Tuesday 5 June 2018

కేన్సర్ కు సంజీవని ఇమ్యునోథెరపీ


బ్రెస్ట్ కేన్సర్‌ను ఆరంభంలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి పేషెంట్ ప్రాణాలు నిలపొచ్చు. కానీ వ్యాధిని గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమై రోగిని కాపాటం అసాధ్యం అవుతుంది. కానీ యూఎస్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మూడు నెలలకు మించి బతకదని చెప్పిన మహిళలో కేన్సర్‌ను పూర్తిగా నయం చేశారు.

ఇందుకోసం పరిశోధకులు సరికొత్త ఇమ్యునోథెరపీ విధానాన్ని అనుసరించారు. ఆమె శరీరంలో నుంచి లింఫోసైట్లను బయటకు తీసి లేబోరేటరీలో వాటికి మార్పులు చేశారు. తర్వాత తిరిగి పేషెంట్ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇలా.. కేన్సర్ కణాలను మట్టుబెట్టే సామర్థ్యం ఉన్న 90 బిలియన్ల ఇమ్యూన్ సెల్స్‌ను ఆమె ఒంట్లోకి పంపారు.



వాస్తవానికి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కారక కణాలు సహా హానికారకమైన, దాడి చేసే ఇతర కణాలను చంపేస్తుంది. కానీ పేషెంట్ డీఎన్ఏతో ఉండే కేన్సర్ కణాలను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదు. దీంతో కేన్సర్ కణాలు విస్తరిస్తాయి. కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటితో పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థకు ఇమ్యునోథెరపీ ట్రైనింగ్ ఇస్తుంది.

ఇలా ఇమ్యూనోథెరపీ చేయడం వల్ల సదరు మహిళలో రెండేళ్లలో కేన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లివర్లో టెన్నిస్ బాల్ పరిమాణంలో కేన్సర్ కణితి ఏర్పడినప్పటికీ.. ఇతర అవయవాలకు వ్యాధి విస్తరిస్తున్నప్పటికీ.. ఈ చికిత్స విధానం ద్వారా ఆమె కేన్సర్‌ను జయించింది. అడ్వాన్స్‌డ్ స్టేజిలో బ్రెస్ట్ కేన్సర్‌ను నయం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం‘‘ఇమ్యూనోథెరపీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, అందరికీ ఒకేలా ఉపయోగించలేం. ఇది ఇప్పటికీ పరిశోధన స్థాయిలోనే ఉంది. కానీ ఈ విధానం ద్వారా ఇతర కేన్సర్లను కూడా నయం చేయొచ్చ’’ని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


No comments:

Post a Comment