Sunday, 6 August 2017

ఏపీలో కేన్సర్ చికిత్స

జిల్లాకు ఒక యూనిట్‌, ప్రాంతానికి ఒక సూపర్‌ స్పెషాలిటీ, ఉన్న దగ్గర ఉన్నతంగా మెరుగులు.. ఏపీ అంతా కేన్సర్‌ వైద్య అవకాశాలను పెద్దఎత్తున పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. రాష్ట్రంలో కేన్సర్‌ వైద్య చికిత్సకు అవకాశాలు తక్కువ. ఉన్నదగ్గర కూడా, ప్రాథమికస్థాయిలోని కేసులకే వైద్యం అందించే వీలుంది.  విజయవాడలో ఈరోజుకీ ఒక్క కేన్సర్‌ సెంటర్‌ కూడా లేదు. విశాఖ, గుంటూరులలో స్టేజ్‌-1 కేసులను చూడగలుగుతున్నారు. దీంతో, అయితే హైదరాబాద్‌ లేదంటే చెన్నై, బెంగళూరుకు రోగులు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలో వారికి వారు ఉన్నదగ్గరే పూర్తిస్థాయిలో పరీక్షలు, చికిత్సను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా.. 13 జిల్లాల్లోనూ జిల్లాకు ఒక చొప్పున కేన్సర్‌ యూనిట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.



విశాఖ కేజీహెచ్‌లో ఆంకాలజీ విభాగంలో రేడియేషన్‌ థెరపీతో కేన్సర్‌ రోగులకు వైద్యం చేస్తున్నారు. సాధారణ స్టేజ్‌లో ఉన్న రోగులకు మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ విభాగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది పక్కా ప్రణాళిక రూపొంచింది. కర్నూలు జిల్లాలో రూ.120 కోట్ల నిధులతో స్టేట్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించే ఈ ఆసుపత్రి.. రిఫరల్‌ సేవలు అందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని కేన్సర్‌ ఆసుపత్రులు, ఓపీ బ్లాక్‌ల నుంచి చివరి దశ రోగులను ఇక్కడకు తరలిస్తారు. ఇక..నెల్లూరు జిల్లాలో రూ. 40కోట్లతో థెర్సికేర్‌ కేన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతుంది. తిరుపతి స్విమ్స్‌లో ఆంకాలజీ విభాగం అద్భుతంగా కొనసాగుతోంది. విజయవాడ, గుంటూరు బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమయింది.

No comments:

Post a Comment