Friday, 6 May 2016

వాయు కాలుష్యంతో కేన్సర్ ముప్పు



వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది.


మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.

Thursday, 5 May 2016

బంగాళాదుంపలతో జీర్ణాశయ కేన్సర్‌ దూరం


కూరగాయలతో కేన్సర్ ముప్పు నుంచి జయించవచ్చని చైనాకు చెందిన శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ముఖ్యంగా ఆలు గడ్డలతో జీర్ణాశయ కేన్సర్‌కు చెక్ పెట్టొచ్చని వారు వెల్లడించారు. బీజింగ్‌లోని జెజియాంగ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు.

ముఖ్యంగా పళ్లు, ఆకుపచ్చ, పసుపు రంగు కూరగాయల వల్ల జీర్ణాశయంలో ఒక రక్షణ పొర ఏర్పడుతుందని, వీటితో పాటు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి జీర్ణాశయంలో ఒత్తిడిని తీవ్రంగా తగ్గిస్తుంది చెప్పారు. ప్రధానంగా ఆలుగడ్డ వంటి తెలుపు రంగు కూరగాయలతో ఈ కేన్సర్ ముప్పు గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు.

గర్భాశయ కేన్సర్ కు ముందుచూపుతో చెక్

ప్రపంచంలో మహిళలు ఎక్కువగా రొమ్ము కేన్సర్‌ తర్వాత గర్భాశయ కేన్సర్‌ తోనే బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అమెరికాలో ప్రతీ 5గురు మహిళల్లో ఒకరు గర్భాశయ కేన్సర్ తో ప్రాణాలు కోల్పోతున్నట్లు బయటపడింది. అసలు గర్భాశయ కేన్సర్‌ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నదానిపై రకరకాల సందేహాలు కలగవచ్చు.





డాక్టర్లు ఏం చెబుతున్నారంటే….. గర్భాశయ కేన్సర్‌ రాకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు. మనం తీసుకునే ఆహారం నుంచి ఎక్సర్‌ సైజ్‌ వరకు అన్నింటిలోనూ జాగ్రత్త వహించాలంటున్నారు. సింపుల్‌ చిట్కాలతోనే గర్భాశయకేన్సర్ కి దూరంగా ఉండవచ్చంటున్నారు.
డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆకుకూరలు, క్యారెట్‌, టమోటా వంటి కెరోటిన్‌, లైకోపీన్‌ వంటి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి.


Wednesday, 4 May 2016

జన్యుమార్పులతో కేన్సర్ ఛాన్స్

 జన్యువులలో వంశపారంపర్యంగా వచ్చే పరివర్తనాలు 12 రకాల కేన్సర్లకు దారితీస్తున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుపరమైన మార్పులతో కేన్సర్‌ వస్తుందనే విషయం గతంలోనే వెల్లడైంది. అయితే, ఈ పరివర్తనాలు అకస్మాత్తుగా రావడం లేదని, తరాల తరబడి వీటి ప్రభావం కొనసాగుతోందని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఒక్కో తరంలో డీఎన్‌ఏలో నిర్ధుష్టంగా జరుగుతున్న మార్పులు చివరకు కేన్సర్‌కు దారితీస్తున్నాయని వివరించారు.

 ప్రధానంగా వీటిలో అండాశయ, స్టమక్‌, రొమ్ము, ప్రోస్టేట్‌, లంగ్‌ (రెండు రకాలు), గ్లియోమా, తల మరియు మెడ, ఎండోమెట్రియల్‌, కిడ్నీ, గ్లియోబ్లాస్టోమా, అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా కేన్సర్లకు కారణం వంశపారంపర్యంగా వచ్చే డీఎన్‌ఏ మార్పులేనని స్పష్టం చేశారు.

జాన్సన్ పౌడర్‌తో గర్భాశయ కేన్సర్

ప్రముఖ టాల్కం పౌడర్ ఉత్పత్తి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి యుఎస్ జ్యూరీ భారీ అపరాధం విధించింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్‌ను వాడిన ఓ మహిళకు ఓవరిన్ కేన్సర్ బారిన పడింది. దీంతో ఈ అపరాధం చెల్లించాల్సిందిగా జ్యూరీ ఆదేశించింది.
 మూడు వారాల పాటు కేసును విచారించిన మిస్సోరీ స్టేట్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అలాగే, బాధిత మహిళకు 5 మిలియన్ డాలర్ల నష్టపరిహారంతో పాటు.. 50 మిలియన్ డాలర్లు శిక్షాత్మక నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.



Tuesday, 3 May 2016

ఆల్కహాల్ తో జీర్ణాశయ కేన్సర్

వరల్డ్ కేన్సర్ రీసెర్చ్ ఫెడరేషన్ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 89 పరిశోధనలను నిశితంగా విశ్లేషించి ఓ కొత్త విషయాన్ని నిర్థారించుకున్నట్లు వెల్లడించింది. దాని ప్రకారం.. రోజుకు మూడు, నాలుగు పెగ్గుల మద్యం, నిల్వ ఉంచిన మాంసాహార పదార్థాలు తీసుకోవడం జీర్ణాశయ కేన్సర్ రిస్క్ ను పెంచుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఈ రిస్క్ మహిళలతో పోలిస్తే పురుషులలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని, అలాగే వృద్ధులు దీని బారిన పడటం ఎక్కువగా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సుమారు 77 వేల మంది జీర్ణాశయ కేన్సర్ బాధితులను పరిశీలించినట్లు సమాచారం. చివరగా ఈ విషయంలో కాస్త ఆలోచించకపోతే.. పెద్ద ప్రమాదమే ఎదుర్కోవాలని వస్తుందని పరిశోధకులు స్పష్టం చేశారు.

కీమోథెరపీతో కేన్సర్ కు చెక్

కేన్సర్‌ చికిత్సలో కీమోథెరపీ మందులకున్న ప్రాధాన్యం తెలిసిందే! సాధారణంగా ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్ల రూపంలో ఈ మందులను రోగి శరీరంలోకి పంపిస్తారు. ఈ పద్ధతిలో మందు కేన్సర్‌ కణితిని చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో దాని ప్రభావం పూర్తిస్థాయిలో ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కీమోథెరపీ మందును నేరుగా కేన్సర్‌ కణితికి చేరవేస్తే మరింత మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇందుకోసం పేస్‌మేకర్‌ తరహాలో శరీరంలోకి ప్రవేశపెట్టే పరికరాన్ని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశా రు. దీని సాయంతో పాంక్రియాటిక్‌ కేన్సర్లలో పెరిగిన కణితిని కుచించుకు పోయేలా చేయవచ్చన్నారు. ఆపై శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చని ఎంఐటీకి చెందిన లారా ఇండోల్ఫి తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో తాజా ఆవిష్కరణతో 12 రెట్లు మెరుగైన ఫలితాలు సాధించినట్లు లారా వివరించారు.