Thursday, 7 April 2016

కార్బైడ్ పండ్లతో కేన్సర్ ఖాయం

ఏ కాయనైనా రసాయనాలతో మగ్గబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్న అక్రమార్కులు తాజాగా అరటిపండ్లపై దృష్టి పెట్టారు. అరటికాయలను పండ్లుగా మార్చేందుకు కొన్ని రసాయనాలు వినియోగిస్తున్నా, నాలుగైదు రోజులపాటు నిగనిగలాడుతూ ఉండేందుకు విషతుల్యమైన కార్బన్‌ డైజన్‌తో కడుగుతున్నారు. మనుషులు వాడరాదని సీసాలపై ఉన్నా…అరటికాయలను పండ్లుగా మగ్గబెట్టేందుకు వ్యాపారులు అతి ప్రమాదకరమైన పద్ధతులను వినియోగిస్తున్నారు. కొత్త పంటల కోసం దాచిన విత్తనాలు బూజు పట్టకుండా వాడే ఫంగిసైడ్‌ను అరటికాయలు
మగ్గబెట్టడానికి వినియోగిస్తున్నారు. దీంతోపాటు విషతుల్యమైన రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. వ్యాపారులు వినియోగిస్తున్న క్రిమి సంహారక మందుల సీసాలపై మనుషులు వాడకూడదన్న హెచ్చరికలు, విషపు తీవ్రత తెలిపే సూచికలున్నా బేఖాతరు చేస్తున్నారు.


                  కార్బన్ డైజిన్ రసాయనం పండ్లలోకి వెళ్లి తినేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్బైడ్ పండ్లతో అల్సర్‌తో పాటు జీర్ణాశయ సమస్యలు, కేన్సర్‌ కూడా వచ్చేఅవకాశాలున్నాయని చెబుతున్నారు.

దమ్ము కొట్టాలంటే.. ఇకపై టెర్రరే..!

దమ్ముకొట్టాలంటే ఇకపై దమ్ముండాలి. స్మోక్ చేయడమే కాదు.. జస్ట్ చూస్తేనే భయపడేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. పొగాకు ఉత్పత్తులపై పిక్టోరియల్ వార్నింగ్ చిత్రాలు 85శాతం పెంచుతూ జారీ చేసిన జీవో అమల్లోకి వచ్చేసింది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టూ హెల్త్.. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సిగరెట్ ప్యాకెట్లపైనా, బీడీ కట్టలపైనా, ఇతర టొబాకో ప్రొడక్ట్స్ పైనా ఇది ప్రింట్ చేసి ఉంటుంది. అటు సినిమా హాళ్లలో కంపల్సరీగా దీన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. అయినా పొగాకు వాడకానికి దూరంగా ఉండటంపై కొందరిలో ఇంకా అవేర్ నెస్ రావడం లేదు.
విపరీతంగా స్మోక్ చేస్తూ, గుట్కా పాన్ మసాల వంటివి తీసుకుంటూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు టొబాకో యూజర్స్. రేట్లు పెంచితే పరిస్థితి మారుతుందని ఏటా పొగాకు ఉత్పత్తులపై సర్కార్ ట్యాక్స్ బాదేస్తుంది. అయినా నో చేంజ్. ఇక దీంతో సీరియస్ డెసీషన్ కు వచ్చింది కేంద్ర సర్కార్.

                   పొగాకు వాడకంతో ఏటా 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. ప్రజలకు అత్యంత ప్రమాదకరంగా మారిన పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక బొమ్మల సైజు పెంచితే అన్నా ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో.. కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. కేంద్రం నిర్ణయంపై డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహన వచ్చినప్పుడే కేన్సర్ రోగులు తగ్గుతారని చెబుతున్నారు.

Wednesday, 6 April 2016

ఈసారి వాల్డ్ హెల్త్ డే థీమ్ డయాబెటిస్

ప్రతి రోజూ ఉరుకులు, పరుగులు. డైలీ లైఫ్ లో ఎన్నో సవాళ్లు…. బిజీలో పడిపోయి లైఫ్ ని డేంజర్ లో పడేసుకుంటున్నారు జనాలు. హెల్త్ కేర్ అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కసారిగా వచ్చే అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – WHO యేటా వాల్డ్ హెల్త్ డే ను నిర్వహిస్తుంది. ఏవ్రీ ఇయర్ ఓ థీమ్ ను ఎంచుకుని దానిపై పబ్లిక్ లో అవేర్ నెస్ కల్పిస్తోంది. ఇవాళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ యేడాది దీర్ఘకాలిక వ్యాదుల్లో
ప్రధానమైన డయాబెటిస్ ను థీమ్ గా ఎంపిక చేసింది WHO. వ్యాధి బారిన పడుతున్న కారణాలు, డయాబెటిస్ రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలంటూ సెమినార్స్ నిర్వహిస్తోంది.


            ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోట్లమంది షుగర్ వ్యాధి బారిన పడుతుండగా..ఒక్క ఇండియాలోనే 7 కోట్లమంది టైప్1,టైప్ 2 డయాబెటీక్ వ్యాదికి గురయ్యారని  లెక్కలుచెబుతున్నాయి.  డయాబెటీస్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులైన  B.P, థైరాయిడ్ సమస్యతో జనం అనారోగ్యానికి గురవుతున్నారు. అన్నింటికి మించి..మనం తీసుకుంటున్న ఆహారం పొల్యూట్ అవడం హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. పండ్లు, కూరగాయలు కూడా రసాయనాలతో పండించినవి తినాల్సిరావడం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుందంటున్నారు డాక్టర్లు. క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ డిసీజెస్ పై అవేర్ నెస్ పెరగాలంటున్నారు. ఆరోగ్యమే..మహాభాగ్యం. హెల్త్ బాగుంటేనే అన్నీ సెట్ అవుతాయి. సో ఎంత బిజీ లైఫ్ అయినా హెల్త్ పై కేర్ తప్పనిసరి అంటోంది WHO

సన్నని నడుముతో కేన్సర్ దూరం

సన్నని నడుం అందానికి చిహ్నమ‌నుకుంటాం. ముఖ్యంగా నాజూకైన నడుము మగువల అందానికి తార్కాణంగా భావిస్తుంటాం. అందానికే కాదు ఆరోగ్యానికి కూడా నడుము సన్నగానే ఉండాలంటున్నారు పరిశోధకులు. నడుము లావుగా పెరిగితే న‌డి వయసులో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకనే జీవన రీతులను మెరుగుపరుచుకుని, ఆహారపు అలవాట్లను నియంత్రించుకుని, శారీరక వ్యాయామం చేస్తూ  నడుము లావు
కాకుండా చూసుకోవాలని బ్రిటన్ లోని న్యూ కేస్ట్లే యూనివర్సిటీ కి చెందిన ప్రొఫెసర్ జాన్ మెతెర్స్ సూచిస్తున్నారు.



                నడుము లావు ఐదు శాతం పెరిగితే కేన్సర్ ప్రమాదం 18 శాతం పెరిగిన‌ట్లు పరిశోధకులు కనుగొన్నారు. మగవారికి పదేళ్ళ కాలంలో న‌డుము కనీసం 10 సెంటీమీట‌ర్లు లావు పెరిగితే కేన్సర్ ప్రమాదం 60 శాతం పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు.

ఆవునెయ్యితో కేన్సర్ దూరం

ఆవునెయ్యిలో అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, డి, ఇ మరియు కే వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే.. రోజుకు అవసరమయ్యే విటమిన్లు  అందుతాయి. ఆవునెయ్యిని రెగ్యులర్ గా తక్కువ మోతాదులో ఉపయోగిస్తే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఓ టీస్పూన్ నెయ్యిని రోటీపై రాసుకుని తింటే.. ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా.. ఇమ్యూనిటీని పెంచుతుంది. అరచేతులు, అరికాళ్లు మంటలకు
ఆవునెయ్యితో ఆ భాగాలను మాలిష్ చేస్తే మంటలు తగ్గుతాయి.  ఎక్కిళ్లు తగ్గాలంటే అరచెంచా ఆవునెయ్యి తీసుకుంటే సరిపోతుంది.


         ఆవునెయ్యి కేన్సర్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ కేన్సర్, పేగుల కేన్సర్ ను ఇది నిరోదిస్తుంది. హృద్రోగులకు ఆవునెయ్యి వరం వంటిది. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు పాలలో చెంచాడు నెయ్యి వేసుకుని తాగితే అలసట పోయి బలంగా ఉంటారు. ఆవునెయ్యి వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరుగుతారు. ఆవుపాలల్లో పంచదార, మిరియాల పొడి కలుపుకుని తాగితే.. కంటి సమస్యలు తగ్గుతాయి. 

Monday, 7 March 2016

నేటి మహిళ.. మేటి శక్తి

మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతటి ప్రాధాన్యతల గల 8వ తేదీ ముంగిట్లో... మార్కెట్‌ యుగంలో మహిళ స్థితిగతులను పరిశీలిద్దాం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది.

యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.

మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసాపు చివరి ఆదివారం నాడు రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకు పైగా సైనికులు మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కేన్సర్ ను జయించిన మహిళలు
----------------------------------
మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోవడమే కాకుండా.. ప్రాణాంతకమైన వ్యాధుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల్ని బాధిస్తున్న కేన్సర్ ను కొందరు సెలబ్రిటీలు జయించి.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
. బాలీవుడ్ బ్యూటీ లీసారే 2009లో కేన్సర్ బారిన పడింది. కొన్నాళ్ల పాటు కేన్సర్ తో పోరాడాక.. లీసారే ఆరోగ్యాన్ని సంతరించుకుంది. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ట్రీట్ మెంట్ ద్వారా కేన్సర్ నుంచి బయటపడినట్లు.. 2010లో లీసారే ప్రకటించింది. అప్పట్నుంచి కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. 

. అలనాటి బాలీవుడ్ తార ముంతాజ్ కూడా క్యాన్సర్ తో పోరాడినవారే. యాభై నాలుగేళ్ల వయసులో కేన్సర్ సోకిన ముంతాజ్.. బ్రెస్ట్ కేన్సర్ పై విజయం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆపరేషన్, కీమో, రేడియేషన్ చికిత్సలు చేయించుకున్న ముంతాజ్.. ఆ నేపథ్యంలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను అధిగమించారు. 2010లో కేన్సర్ సర్వైవల్స్ పై యూనిగ్లోబ్ ఎంటర్ టైన్ మెంట్స్ తీసిన డాక్యుమెంటరీలో ముంతాజ్ కనిపించారు. 

. నేపాలీ బ్యూటీ మనీషా కొయిరాలా కూడా కేన్సర్ ను జయించినవారే. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరించిన మనీషా.. 42 ఏళ్ల వయసులో కేన్సర్ బారిన పడ్డారు. న్యూయార్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మనీషా.. కీమోథెరపీ సమయంలో తన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి సంచలనం సృష్టించారు. కీమోథెరపీ కారణంగా హెయిర్ లాసైనా.. మనీషా ధైర్యంగా పోరాడారు. కేన్సర్ ను ఓడించిన తర్వాత.. తన మునుపటి రూపు సంతరించుకున్న మనీషా.. అప్పట్నుంచి కేన్సర్ అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.  

. హాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ ఏంజెలీనా జోలీకి కూడా బ్రెస్ట్ కేన్సర్ సోకింది. బ్రెస్ట్ , ఒవేరియన్ కేన్సర్ బారిన పడకుండా తాను ఆపరేషన్ చేయించుకున్నట్లు ఏంజెలీనా ధైర్యంగా ప్రకటించారు. హాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరున్న ఏంజెలీనా.. తన తల్లి నుంచి తనకు కేన్సర్ సోకుతుందని తెలియగానే.. డబుల్ మాస్టెక్టమీ చేయించుకున్నారు. కేన్సర్ ను నివారించడం ద్వారా ఏంజెలీనా.. మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు. 

. గాయనిగా, నటిగా అందరికి సుపరిచితురాలయిన మళయాళ భామ మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఓ సారి క్యాన్సర్ నుండి కోలుకున్న ఆమె తిరిగి మళ్లీ క్యాన్సర్ బారిన పడింది. ఇప్పుడు కోలుకుంది. ఇటీవలె భర్త నుండి విడాకులు కూడా తీసుకున్న మమతా మోహన్ దాస్ సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుని తాను స్ట్రాంగ్ గా ఉన్నానని తెలిపింది. కేన్సర్ అనగానే అందరిలా నేను భయపడ్డాను. అది తిరగబెట్టడంతో మరింత భయపడ్డాను. కానీ జీవితంలో ఒక్కో దెబ్బ మనిషిని రాటుదేలుస్తుంది. ఇప్పుడు నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను అంటోంది మమతా మోహన్ దాస్. 

Wednesday, 3 February 2016

ఇవాళ వాల్డ్ కేన్సర్ డే

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెలలో 6 లక్షల మంది మృత్యువాత.. ఏ వైపరీత్యమో సంభవించి వీరు ప్రాణాలు కోల్పోవడం లేదు.. ఇంతటి భారీ సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవడంతో అన్ని దేశాల్లో ఒకటే కలవరం.. ఇదీ కేన్సర్ వ్యాధి విసిరిన పంజా.. ఈ వ్యాధి కారణంగా అకాలమృత్యువు పాలవుతున్న వారిలో మహిళల సంఖ్యే అధికం.. రాబోయే 20 నుంచి 40 ఏళ్లలో కేన్సర్ మరణాల సంఖ్య రెట్టింపయ్యే ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు మరింతగా భయాందోళనల్ని కలిగిస్తున్నాయి. కేవలం భారత్‌లోనే ఏటా పదిలక్షల మంది కొత్తగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు.. ఇందులో లక్ష మంది మహిళలు రొమ్ము కేన్సర్‌కు లోనవుతున్నారు. ప్రధానంగా రొమ్ము, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌లతో మహిళలు రోగపీడితులవుతున్నారు. సరైన వైద్య సహాయం లభించక పేద, మధ్య తరగతి స్ర్తిలు ప్రాణాలు కోల్పోతున్నారు. అన్ని దేశాల్లోనూ కేన్సర్ మరణాల సంఖ్య భారీగా ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలు కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించింది. కేన్సర్‌పై విశ్వవ్యాప్తంగా అవగాహనకు ఏటా ఫిబ్రవరి 4వ తేదీన ‘వరల్డ్ కేన్సర్ డే’ పాటిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ‘నివారణ, నిర్ధారణ, చికిత్స’- అనే మూడు అంశాలకు ప్రాధ్యామిస్తూ కేన్సర్‌పై ప్రచారానికి దేశదేశాల్లో ఎనె్నన్నో స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. కేన్సర్ నివారణకు ‘యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కం ట్రోల్’ (యుఐసిసి) ఏర్పాటైంది. ఇందులో 120 సభ్య దేశాలకు చెందిన 470 ప్రభుత్వేతర సంస్థలు కేన్సర్ అంతానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. మరణాల సంఖ్యను తగ్గించేందుకు ముందుగా అందరిలో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఏటా ఫిబ్రవరి 4న ‘వరల్డ్ కేన్సర్ డే’ను పాటిస్తున్నారు.


                             మనకు తెలియకుండా మాటు వేసి, దొంగ దెబ్బ తీస్తున్న కేన్సర్ మహమ్మారి నానాటికీ తన వికృత రూపంతో భయపెడుతోంది. శరీరంలో ఏ భాగంలో ఈ వ్యాధి సోకుతుందో ముందు గా చెప్పలేని పరిస్థితి ఉంది. శరీరంపై ఏదో ఒక భాగంపై ‘టార్గెట్’ చేశాక.. ఇది ఎప్పుడు బయట పడుతుందో చెప్పలేం. వ్యాధిని గుర్తించాక అప్పటికే ఎంతో నష్టం జరిగిపోవచ్చు. ఆ తర్వాత చికిత్స వల్ల ఏ మేరకు ఫలితం ఉంటుందో వైద్యులు సైతం కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నోరు, గొంతు, మెదడు, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, జీర్ణాశయం, కిడ్నీలు, గర్భాశయ ముఖద్వారం, థైరాయిడ్, గాల్‌బ్లేడర్.. ఇలా శరీరంలో ఏ భాగంలోనైనా కేన్సర్ విరుచుకుపడొచ్చు.
                        ఆహారంలో లోపాలు, చెడు అలవాట్ల కారణంగా చాలామంది కేన్సర్‌ను కొని తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు  హెచ్చరిస్తునే ఉన్నారు. వ్యాధిగ్రస్తుల్లో నూటికి 70 శాతం మంది చేజేతులా సమస్యలను ఆహ్వానిస్తున్నవారేనని వైద్యు లు చెబుతున్నారు. ఆహార లోపాలు, దురలవాట్లను అరికడితే 30 శాతం వరకూ కేన్సర్‌ను నివారించే అవకాశాలు లేకపోలేదు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందిస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు. ముందుగా ఈ వ్యాధికి సంబంధించి సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. శరీరంపై కణుతులు, గడ్డలు ఏర్పడడం, గాయాలు మానకపోవడం, అసాధారణ రక్తస్రావం, నిత్య అజీర్ణం, చాలాకాలంగా గొంతు రాపిడి తదితర లక్షణాలు ఈ వ్యాధికి ప్రారంభ సంకేతాలని గమనించాలి. రొమ్ము, గర్భాశయ, గర్భాశయ ముఖద్వార, పెద్దపేగు తదితర శరీర భాగాలపై కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించే అవకాశాలున్నాయి. కేన్సర్ అంటే ఏమిటి? ఇది ఎలా వస్తుంది? ఎన్ని రకాలుగా దాడి చేస్తుంది?, గుర్తించడం ఎలా? నివారణ పద్ధతులు ఏమిటి?.. అనే అంశాలపై విస్తతృ ప్రచారం చేస్తేనే ప్రజల్లో అవగాహనకు ఆస్కారముంది.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఎంతగా హెచ్చరిస్నున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చాలామంది చెడు అలవాట్లకు దాసోహమవుతునే ఉన్నారు. సిగరెట్, బీడీ, గుట్కా, మద్యపానం, లైంగికంగా వ్యాపించే ఇన్‌ఫెక్షన్లు, ఊబకాయం, తగినంత ఆహారం తీసుకోకపోవడం కేన్సర్‌కు కొన్ని కారణాలని వైద్య నిపుణులు ఘోషిస్తునే ఉన్నారు. వాతావరణ కాలుష్యం, పదే పదే మరగించి వంట నూనెలు వాడడం కూడా కేన్సర్ దాడికి అవకాశం కల్పిస్తున్నాయి. పండ్లు, శాకాహారాన్ని తగినంతగా తీసుకోకపోవడం కూడా మరో కారణం.
                      తగిన అవగాహన ఉంటే నోరు, గర్భాశయం, రొమ్ము కేన్సర్‌లను ముందుగానే గుర్తించే అవకాశాలున్నాయి. కొన్ని రకాల కేన్సర్‌లను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్సకు వీలుంది. చాలామంది తొలి దశలో దీన్ని గమనించలేకపోతున్నారు. ఇది బాగా ముదిరిన సందర్భాల్లోనే అధిక శాతం వ్యాధిగ్రస్తులు వాస్తవాలను తెలుసుకుంటున్నారు. కేన్సర్ నిర్ధారణ, నివారణ అన్నది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో పేదవర్గాల వారు మేలైన చికిత్సకు దూరంగానే ఉండడం ఆందోళనకరం.
                                   కేన్సర్‌పై విశ్వవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈ ఏడాది వినూత్న ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని ‘యుఐసిసి’ (యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కేన్సర్ కంట్రోల్) సంస్థ సంకల్పించింది. ఈ ఏడాది ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ‘అంతా ఒక్కటైతే సాధ్యమే’ అన్న నినాదాన్ని యుఐసిసి ఇచ్చింది. ఈ ఏడాది న్యూయార్క్‌లోని ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ను నీలం, ఆరంజ్ రంగులతో కాంతులీనే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే, ‘ఫేస్ బుక్’, ‘ట్విట్టర్’ల ద్వారా కేన్సర్ నివారణకు సందేశాలు పంపేవారు తమ ఫొటోలను నీలం, ఆరంజ్ రంగుల్లో పంపాలని యుఐసిసి కోరుతోంది. కేన్సర్‌పై అవగాహనకు ప్రపంచ వ్యాప్తంగా సదస్సులు, ర్యాలీలు, లఘు చిత్రాలు, ఇతర రూపాల్లో విస్తృత ప్రచారం కల్పిస్తారు. మంచి ఆహారం, చెడు అలవాట్లు వంటి విషయాలపై భారీగా ప్రచారం చేయాలని, ఇందుకు అన్ని దేశాల్లో పాలకులు, అధికారులు తగిన బాధ్యత తీసుకోవాలని యుఐసిసి విజ్ఞప్తి చేసింది. 2025 నాటికి కేన్సర్ మరణాల సంఖ్య 25 శాతం తగ్గేలా అన్ని దేశాలు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేయాలని డబ్ల్యుహెచ్‌ఓ పిలుపునిచ్చింది.
             ప్రపంచానే్న భయపెట్టిన ‘ఎయిడ్స్’ వ్యాధిపై ఏ విధంగా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగిందో, కింది స్థాయి వరకూ చికిత్సలను అందుబాటులోకి తెచ్చారో అదే రీతిలో కేన్సర్ నివారణకు భారీ ప్రయత్నాలు జరగాలని వైద్యరంగ ప్రముఖులు కోరుతున్నారు. మన దేశంలో పేదలు, మధ్య తరగతి వారే అధికంగా ఉన్నందున వీరిలో కేన్సర్ పీడితులకు ఉచిత చికిత్సలు అందాలి. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సలకు ఆధునిక యంత్ర పరికరాలను వీరికి అన్ని స్థాయల్లో అందుబాటులో ఉంచాలి. *