Saturday, 8 July 2017

కేన్సర్ కి చెక్ పెట్టబోతున్న ఆస్పిరిన్ టాబ్లెట్




ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని అరికడుతుందని గత కొద్ది సంవత్సరాలుగా డాక్టర్లు చెప్తూ వస్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమన్నది స్పష్టం చేయలేదు. ఆ ప్రశ్నకు సమధానం చెప్తున్నారు మద్రాసు ఐఐటీకి చెందిన బయోటెక్నాలజీ ప్రొఫెసర్ అమల్ కాంతి బేరా. సింపుల్ పెయిన్ కిల్లర్ భయంకరమైన కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని ఆయన ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. ఆస్పిరిన్ అనే నాన్ స్టెరాయిడల్, యాంటీ ఇన్ ఫ్లిమేటరీ డ్రగ్ ప్రాణాంతక కేన్సర్ కణాలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందనే పాజిటివ్ సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ డ్రగ్ కేన్సర్ కణాల్లోని మైటోకాండ్రియాలో ఉన్న అధిక స్థాయి కాల్షియం అయాన్లను ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఆహారాన్ని శక్తిగా మార్చకుండా మైటోకాండ్రియాను నిరోధిస్తుంది. ఇలా ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోవడంతో కేన్సర్ కణాలు క్రమంగా చనిపోతాయి. ఈ డ్రగ్ ని మరింత శక్తివంతంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.. ప్రతీ రోజు తక్కువ మోతాదు ఆస్పిరిన్ తీసుకుంటే హై రిస్క్ కార్డియాక్ డిసీజ్ ఉన్న వ్యక్తుల్లో ఎలాంటి పాజిటివ్ రియాక్షన్ వస్తుందో, కేన్సర్ విషయంలో కూడా అదే ఎఫెక్ట్ వస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.


అయితే, ఆస్పిరిన్ డ్రగ్ కేన్సర్ ని పూర్తిగా నయం చేస్తుందని ఇప్పటికప్పుడు భరోసా ఇవ్వలేం అంటున్నారు. ఇంకా క్లినికల్ స్టడీస్ జరగాలనేది వారి అభిప్రాయం. ఏది ఏమైనా చివరికి విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 2016 నాటికి దేశంలో 14.5 లక్షల మంది కేన్సర్ రోగులున్నారు. 2020కల్లా వారి సంఖ్య 17.3 లక్షలు పెరగొచ్చని అంచనా. కేన్సర్ ప్రారంభ దశలో ఉండగా చికిత్స పొందుతున్న వారు 12.5 శాతం మంది ఉన్నారు.
ఏది ఏమైనా కేన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి, ఖరీదైన దాని చికిత్సకు ఒక చిన్న మాత్ర ద్వారా చెక్ చెప్పడానికి దారులు పరుచుకున్నాయి. చేస్తున్న పరిశోధనలను, వస్తున్న రిపోర్టులను బట్టి భవిష్యత్ లో దానిపై వందశాతం నమ్మకం కలుగుతోంది. నిజంగా ఆస్పిరిన్ ద్వారా కేన్సర్ ని అరికట్టగలిగితే వైద్య చరిత్రలోనే అదొక సంచనల విజయం అవుతుంది.

Friday, 7 July 2017

కేన్సర్ కణాలను మట్టుబెట్టే విటమిన్

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పొట్టన బెట్టుకుంటున్న వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. ఈ వ్యాధి బారిన పడి 2015లో 90 లక్షల మంది మరణించారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నయం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు జరుపుతున్నారు. ఏ ఆహారం తీసుకుంటే కేన్సర్ ముప్పును తగ్గించవచ్చు, ఏ విటమిన్లు ఈ వ్యాధి కారక కణాలను నాశనం చేస్తాయి.. అనే దిశగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సాగిన ఓ అధ్యయనంలో కేన్సర్ కణాలను విటమిన్-సి నాశనం చేస్తోందని తేలింది.





ఆంకోటార్గెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఈ అధ్యయాన్ని ప్రచురించారు. ఇతర మందులతో పోలిస్తే.. కేన్సర్ మూల కణాలను విటమిన్-సి పదిరెట్లు ఎక్కువగా అంతం చేస్తోందని, వ్యాధి ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటోందని సదరు అధ్యయనం తేల్చింది. నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి ఎక్కువగా లభిస్తుంది.
కేన్సర్‌పై పోరాడేందుకు రోజువారీ ఆహారంలో భాగంగా ఎంత మోతాదులో విటమిన్-సి తీసుకోవాలనే విషయమై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు.

Thursday, 6 July 2017

బొజ్జతో పాటు పెరుగుతున్న కేన్సర్‌ ముప్పు



 పెరిగిపోతున్న బొజ్జతో కేన్సర్‌ ముప్పు కూడా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అధ్యయనం హెచ్చరించింది. ఇందులో ప్రేగు, రొమ్ము కేన్సర్లతో పాటు పాంక్రియాటిక్‌ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువన్నారు. బీఎంఐ లానే పొట్ట, నడుము కొలతలు కూడా కేన్సర్‌ ముప్పును అంచనా వేయడానికి బాగా తోడ్పడతాయని అంతర్జాతీయ పరిశోధకులు వివరించారు. పొట్ట 11 సెంటీమీటర్లు పెరిగితే స్థూలకాయానికి సంబంధించిన కేన్సర్ల ముప్పు 13 శాతం పెరుగుతోందని వివరించారు.




ముఖ్యంగా బొజ్జ 8 సెంటీమీటర్లు పెరిగితే ప్రేగు కేన్సర్‌ వచ్చే ముప్పు 15 శాతం పెరుగుతోందన్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. కేన్సర్‌ రావడానికి కారణమయ్యే అంశాలలో పొగ త్రాగే అలవాటు తర్వాతి స్థానం స్థూలకాయానిదేనట! బరువును నియంత్రించుకోవడం ద్వారా ఈ ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువుతో లైంగిక హర్మోన్ల స్థాయుల్లో మార్పులు చోటుచేసుకొని, కేన్సర్‌ ముప్పును పెంచుతున్నాయన్నారు.

Wednesday, 5 July 2017

కొవ్వులతో తరతరాలకూ కేన్సర్

కొవ్వు ఎక్కువ అవుతోంది. కాస్త తగ్గించు. మన పెద్దలు అభిమానపూర్వకంగా చెప్పే ఈ మాటలో చాలా నిగూఢార్థాలు ఉన్నాయి. అధిక కొవ్వుతో గుండెపోటుతో పాటు కేన్సర్ కూడా వస్తుందట. అదే గర్భిణులకు కొవ్వు ఎక్కువైతే వారి సంతానానికి రొమ్ము కేన్సర్ ముప్పు తప్పదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మాటలు వింటుంటే పెద్దల మాట ఎందుకు చద్దిమూటో మరోసారి గుర్తొస్తోంది కదూ.


మహిళలు గర్భంతో ఉన్నపుడు అధిక కొవ్వు ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే సంతానానికి రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఆ ప్రభావం మూడు తరాల వరకు ఉంటుందని తెలిపారు. అధిక కొవ్వు గర్భిణుల్లో జన్యు సంబంధ మార్పులు చోటుచేసుకుని రొమ్ము కేన్సర్‌కు దారి తీస్తుందని అమెరికాలోని జార్జ్‌టౌన్‌ లాంబార్డీ కాంప్రహెన్సివ్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు.

Tuesday, 4 July 2017

కేన్సర్ ప్రాణాపాయాన్ని గుర్తించే పరీక్ష



 రొమ్ముకేన్సర్‌ బాధితులు చికిత్స ద్వారా కణితిని తొలగించుకున్నా ముప్పు పూర్తిస్థాయిలో తప్పినట్లుకాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కణితిని తొలగించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా కేన్సర్‌ కారణంగా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో రొమ్ము కేన్సర్‌ చికిత్స తర్వాత బాధితుల ప్రాణాపాయ ముప్పును పరీక్షించే
సరికొత్త పరీక్షను అభివృద్ధి చేసినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తెలిపారు.


ఈ మాలిక్యులర్‌ పరీక్షలో బాధితులకు ప్రమాదం పెద్దగా లేదని తేలితే.. వారికి అందించే చికిత్స తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో చికిత్స కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని వర్సిటీ ప్రొఫెసర్‌ లారా జే ఎసెర్‌మాన్‌ వివరించారు.

Sunday, 2 July 2017

బ్లడ్ కేన్సర్ బాధితులకు గుడ్ న్యూస్


బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించేందుకు ఓ కొత్త మెడిసిన్ ను సైంటిస్టులు తయారు చేశారు. ఈ మందును విడిగా వాడినా.. కిమోథెరపీతో పాటు అందించినా మంచి ప్రభావం చూపిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో స్పష్టమైంది. ఈ డ్రగ్ ను అభివృద్ధి చేసిన టీంకు భారత సంతతి పరిశోధకురాలు,యూనివర్శిటీ ఆఫ్ యూటా పోస్ట్ డాక్టొరల్ శ్రీవిద్య భాస్కర  నేతృత్వం వహించారు. అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా(ALL) గా వ్యవహరించే బ్లడ్ కేన్సర్ చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిపైనా దాడిచేస్తుంది. దీని బాధితుల్లోని 30% మందిలో ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. క్రోమోజోమ్ లోని రెండు విభాగాలు వాటి స్వభావానికి భిన్నంగా అతుక్కుపోతే దాన్ని ఫిలడెల్పియా క్రోమోజోమ్ గా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పడిన ఈ క్రోమోజోమ్ DNA ను మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. DNA  రిపేర్ అంటే వినడానికి ఏదేదో మంచి విషయంలాగానే అనిపించవచ్చు. కానీఈ క్రమోజోమో చే మరమ్మతు ఫలితం చెడుకే దారి తీస్తుంది. ఆ ప్రక్రియ వ్యసనంగా మారి నిరంతరం కొనసాతుంది. ఈ ప ర్రక్రియ కోసం ఆక్రోమోజోమ్ వినియోగించే రకరకాల ప్రోటీన్లను అడ్డుకోడానికి పలు రకాల మందలను వాడాలి. అలా వాడితే అవి విషపూరితంగా మారి సాధారణ కణాలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉంది.


అందుకే ఈ వ్యసనాన్ని నిరోధించేందుకు విస్తృతంగా ప్రయోగాలు చేసి హిస్టోన్ డియాసిటైలసిస్(HDAC1,2) అనే రెండు ప్రొటీన్లపై ప్రధానంగా దృష్టి సారించి సరికొత్త మెడిసిన్ ను ఆవిష్కరించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ డ్రగ్ ను రోగుల నమూనాలు, ఎలుకల మీద పరీక్షించగా సంతృప్తి కరమైన ఫలితాలు వచ్చాయన్నారు. లుకేమియా అనేది తెల్లరక్తకణాల వ్యాధి. అంటే ఇవి వచ్చినవారి శరీరం ఎర్రకర్త కణాలకు బదులు తెల్లరక్తకణాలను ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేస్తుంది. అయితే.. లుకేమియా ఉన్న ఎలుకలకు ఈ మందును విడిగా ఇచ్చినా లేక కీమోథెరఫీలో ఇచ్చే డోక్సోరుబిసిన్ తో కలిపి ఇచ్చినా..అప్పటిదాకా పాలిపోయినట్టుగా ఉండే వాటి బోన్ మ్యారో ఎరుపు రంగులోకి మారడం గమనించామని…ఎర్రకర్త కణాలు ఎక్కువగా పుడుతున్నాయనడానికి ఇది సంకేతమన్నారు. ఈ ఔషదం ఒక్కటే విడిగా వాడినప్పటి కంటే డోక్సోరుబిసిన్ తో కలిపి వాడినప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Saturday, 1 July 2017

తాజా కూరలతో కేన్సర్ దూరం



పెద్దల మాట చద్దిమూట అని ఎందుకంటారో.. అప్పుడప్పుడూ సైంటిస్టుల పరిశోధనలు రుజువు చేస్తుంటాయి. చాలా వరకు పరిశోధనల్లో అప్పటిదాకా సామెతలుగా ఉన్న మాటలే నిజమౌతాయి. ఎందుకంటే తాజా పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివని ఎప్పట్నుంచో మన పెద్దలకు నమ్మకం. అందుకే గర్భిణులు, బాలింతలకే కాదు.. అందరూ ఇవి ఎక్కువ తినాలని చెబుతుంటారు. ఇప్పుడు కూడా అదే నిజమని సైంటిస్టులు తేల్చారు.

పండ్లు, కూరగాయలు, చేపలు ఎక్కువగా తింటూ సాఫ్ట్‌ డ్రింక్‌లను తగ్గిస్తే పేగు కేన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ కేన్సర్‌కు కారణం ఆహారంలో ఫైబర్లు లోపించడమేనని టెల్‌ అవీవ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. దీంతోపాటు ఆల్కహాల్‌ సేవించడం, కాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం సీఆర్‌సీకి కారణమవుతున్నాయని వివరించారు.