నీ సహజ రూపం ఏమిటో, నీ వాస్తవ స్వభావం ఏదో తెలుసుకోడానికి...హిమాలయాల దాకా వెళ్లాల్సిన పన్లేదు, గురువుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్ సెర్చింజిన్ గోలే అక్కర్లేదు. ఐదారేళ్ల పిల్లల్ని గమనిస్తే చాలు. నీ ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. ఆ పసివాళ్లని చూడండి. బుల్లిబుల్లి అడుగులేస్తూ ఇల్లంతా పరిగెడతారు. ఆడుతూ పాడుతూ జానెడంత నడుమును చక్రంలా తిప్పేస్తారు. ఏ మాత్రం కష్టపడకుండా విల్లులా ఒంగిపోతారు. చేతులతో పాదాల్ని సునాయాసంగా పట్టుకుంటారు. ఆ మొహంలో మహా నిర్మలత్వం! బొమ్మల కోసమో, బిస్కెట్ల కోసమో మారాం చేసినా...అదీ కాసేపే! మరునిమిషమే హాయిగా నవ్వేస్తారు. వాళ్లకి ద్వేషం తెలియదు, అసూయ తెలియదు. స్వార్థం తెలియదు. అది నిత్య యోగస్థితి! ఒకప్పుడు, నువ్వూ ఇలానే ఉండేవాడివి. నీ స్వభావమూ దాదాపుగా అదే. నీ శరీరంలోని అనారోగ్యాల్నీ, నీ మనసులోని జాడ్యాల్నీ శుభ్రంగా తొలగించుకుంటే...మిగిలేది పసిపాప లాంటి, ఆ నువ్వే. ఆ చెత్తంతా వదిలించుకోడానికి ఒకటే మార్గం యోగా.
నీ ఆకారం ఏమిటి ఇలా మారిపోయింది, కొబ్బరిచెట్టులా నిటారుగా ఉండాల్సిన వాడివి... కాపుకొచ్చిన మామిడి కొమ్మలా ఒంగిపోయావెందుకు? నీ పొట్టేమిటి అలా ముందుకొచ్చింది, చొక్కా లోపల స్టీలు బిందె దాచుకున్నట్టు? ఆ నడుమేమిటి అంతగా ముడతలు పడిపోయింది, చుట్టూ క్యారీ బ్యాగులు తగిలించుకున్నట్టు?
ఈ వంకరటింకర రూపం, ఈ బాన పొట్ట, ఈ కొవ్వుపట్టిన నడుమూ...ఇవేవీ నీవి కాదు. నీ సహజ రూపంలో ఏ ఒక్కటీ లేవు. అసలు, మనిషి అన్నవాడి ఆకృతే ఇలా ఉండదు.
నీది కాని బరువును దించేసుకో.
నీకు అక్కర్లేని కొవ్వును కరిగించుకో.
నిన్ను గుర్తుపట్టకుండా చేస్తున్న ముడతల్ని సరిచేసుకో.
అలా అని ప్లాస్టిక్ సర్జరీల పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలకు లక్షలు సమర్పించుకోవద్దు. బ్యూటీ ట్రీట్‌మెంట్స్ కోసం ఆస్తుల్ని కరిగించుకోవద్దు. మందులూ మాత్రల జోలికి వెళ్లనే వెళ్లొద్దు. నీ శరీరాన్ని నీకు తిరిగిచ్చే శక్తి యోగాకు ఉంది.
No comments:
Post a Comment