Tuesday, 5 June 2018

కేన్సర్ కు సంజీవని ఇమ్యునోథెరపీ


బ్రెస్ట్ కేన్సర్‌ను ఆరంభంలోనే గుర్తిస్తే సరైన చికిత్స అందించి పేషెంట్ ప్రాణాలు నిలపొచ్చు. కానీ వ్యాధిని గుర్తించడం ఆలస్యమైతే చికిత్స కష్టమై రోగిని కాపాటం అసాధ్యం అవుతుంది. కానీ యూఎస్ నేషనల్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మూడు నెలలకు మించి బతకదని చెప్పిన మహిళలో కేన్సర్‌ను పూర్తిగా నయం చేశారు.

ఇందుకోసం పరిశోధకులు సరికొత్త ఇమ్యునోథెరపీ విధానాన్ని అనుసరించారు. ఆమె శరీరంలో నుంచి లింఫోసైట్లను బయటకు తీసి లేబోరేటరీలో వాటికి మార్పులు చేశారు. తర్వాత తిరిగి పేషెంట్ శరీరంలో ప్రవేశపెట్టారు. ఇలా.. కేన్సర్ కణాలను మట్టుబెట్టే సామర్థ్యం ఉన్న 90 బిలియన్ల ఇమ్యూన్ సెల్స్‌ను ఆమె ఒంట్లోకి పంపారు.



వాస్తవానికి మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థ కేన్సర్ కారక కణాలు సహా హానికారకమైన, దాడి చేసే ఇతర కణాలను చంపేస్తుంది. కానీ పేషెంట్ డీఎన్ఏతో ఉండే కేన్సర్ కణాలను రోగ నిరోధక వ్యవస్థ గుర్తించలేదు. దీంతో కేన్సర్ కణాలు విస్తరిస్తాయి. కేన్సర్‌ కణాలను గుర్తించి, వాటితో పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థకు ఇమ్యునోథెరపీ ట్రైనింగ్ ఇస్తుంది.

ఇలా ఇమ్యూనోథెరపీ చేయడం వల్ల సదరు మహిళలో రెండేళ్లలో కేన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. ఆమె లివర్లో టెన్నిస్ బాల్ పరిమాణంలో కేన్సర్ కణితి ఏర్పడినప్పటికీ.. ఇతర అవయవాలకు వ్యాధి విస్తరిస్తున్నప్పటికీ.. ఈ చికిత్స విధానం ద్వారా ఆమె కేన్సర్‌ను జయించింది. అడ్వాన్స్‌డ్ స్టేజిలో బ్రెస్ట్ కేన్సర్‌ను నయం చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం‘‘ఇమ్యూనోథెరపీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ, అందరికీ ఒకేలా ఉపయోగించలేం. ఇది ఇప్పటికీ పరిశోధన స్థాయిలోనే ఉంది. కానీ ఈ విధానం ద్వారా ఇతర కేన్సర్లను కూడా నయం చేయొచ్చ’’ని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.


Monday, 4 June 2018

ప్రోస్టేట్ కేన్సర్ అంత డేంజరా..?



వ్యాధి నిర్ధారణ జరిగి 6 ఏళ్లు. వ్యాధి ముదిరి మంచం పట్టి సరిగ్గా 40 రోజులే! అయినా మెరుగైన చికిత్సలన్నీ చిటికెలో పొందే వీలున్న ఓ ప్రజా ప్రతినిధి ఇటీవలే ప్రోస్టేట్‌ కేన్సర్‌ చేతిలో ఓడిపోయారు. మరి, అన్ని వసతులు లేని సాధారణ వ్యక్తుల పరిస్థితేంటి? ప్రోస్టేట్‌ కేన్సర్‌ పట్ల అందర్లో ఇలాంటి భయాలెన్నో! అయుతే నిజంగానే ఈ వ్యాధి అంత ప్రాణాంతకమైనదా?

ప్రోస్టేట్‌ కేన్సర్‌ అన్ని కేన్సర్‌లలాంటిదే! కాకపోతే లక్షణాలను తీవ్రంగా పరిగణించకపోవడం వల్ల దశలు దాటేసి, మూడు, నాలుగు దశల్లో వైద్యులను కలుస్తూ ఉండడం వల్ల ప్రాణాంతక కేన్సర్‌గా పేరు తెచ్చుకుంది. కానీ తొలి దశలోనే గుర్తించి అప్రమత్తమైతే అన్ని కేన్సర్‌లలాగే దీన్ని కూడా సమూలంగా నయం చేసే వీలుంటుంది. పురుషుల్లో మూత్రాశయం దగ్గర వాల్‌నట్‌ ఆకారంలో ఉండే ఈ ప్రోస్టేట్‌ గ్రంథిలో కేన్సర్‌ పుడుతుంది. కొన్ని కేన్సర్లు ప్రోస్టేట్‌ వరకే పరిమితమై అత్యంత నెమ్మదిగా పెరిగితే మరికొన్ని వేగంగా పెరుగుతూ ప్రోస్టేట్‌ దాటి ఇతర అవయవాలకూ వ్యాపిస్తాయి. లింఫ్‌ గ్రంథులు, ఎముకల్లోకి పాకిన ప్రోస్టేట్‌ కేన్సర్‌ను నయం
చేయడం కొంత కష్టం. అయితే ప్రోస్టేట్‌ వరకే పరిమితమై ఉండి ప్రారంభంలోనే గుర్తించగలిగితే సమర్థమైన చికిత్సతో ఈ కేన్సర్‌ను తేలికగానే నయం చేయొచ్చు.



ఓ కన్నేసి ఉంచండి!
లక్షణాలను పసిగట్టి వెంటనే వైద్యులను కలవడం వల్ల వ్యాధి అదుపులోకొస్తోంది. కానీ మన దేశంలో వ్యాధి ముదిరిపోయిన తర్వాత మూడు లేదా నాల్గవ దశలో వైద్యులను కలవడం వల్ల అప్పటికే కేన్సర్‌ ఇతర శరీర భాగాలకు పాకిపోయి చికిత్సకు లొంగకుండా తయారవుతోంది. కాబట్టి ప్రోస్టేట్‌ కేన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా నయం చేయవచ్చు. ఇందుకోసం 40 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడూ లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే...

-తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం
-మూత్రం చుక్కలుగా రావడం, మూత్రాశయం ఖాళీ కాకపోవడం
-నడుము భాగంలో ఇబ్బంది, నొప్పి
-మూత్రంలో రక్తం
-ఎముకల నొప్పులు
-పురుషాంగం గట్టిపడకపోవడం



Sunday, 3 June 2018

లంగ్ కేన్సర్ కు తేయాకు మందు

గ్రీన్‌ టీలో బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయని, తరచూ ఈ పానీయాన్ని సేవించడం ద్వారా కేన్సర్‌ను నివారించవచ్చునని మనం తరచూ వింటుంటాం. ఇందులో వాస్తవం లేకపోలేదు.  భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి తేయాకులోకి కొన్ని ప్రత్యేక కణాల ద్వారా ఊపిరితిత్తుల కేన్సర్‌కు సమర్థమైన చికిత్స ఇవ్వవచ్చని నిరూపించారు. ఈ క్వాంటమ్‌ డాట్‌ కణాలు అతి సూక్ష్మమైనవి. ధర్మాలూ అనూహ్యం. కొన్ని రసాయనాలతో కలిసి వేర్వేరు రంగుల్లో ప్రతిదీప్తిని కనబరుస్తాయి. అందువల్లనే వీటిని ఇప్పటికే సోలార్‌ సెల్స్‌ మొదలుకొని వైద్య పరీక్షల్లోనూ వాడుతున్నారు. కేన్సర్‌ చికిత్సలోనూ, యాంటీబయాటిక్‌ నిరోధకతను ఎదుర్కొనేందుకూ ఈ క్వాంటమ్‌ డాట్స్‌ ఉపయోగపడుతున్నాయి.



ఈ నేపథ్యంలో భారతియార్, స్వాన్‌సీ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు తేయాకు నుంచి క్వాంటమ్‌ డాట్‌ కణాలను వెలికి తీశారు. వీటి సమక్షంలో ఊపిరితిత్తుల కేన్సర్‌ కణాలు వెలిగిపోవడమే కాకుండా.. వాటిని నాశనం కూడా చేసేశాయి. కేన్సర్‌ కణాల్లోకి చొచ్చుకుపోయిన క్వాంటమ్‌ డాట్స్‌ 80 శాతం కణాలను నిర్వీర్యం చేసినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సుధాకర్‌ పిచ్చయి ముత్తు తెలిపారు. క్వాంటమ్‌ డాట్స్‌ను కేన్సర్‌ చికిత్సకు మాత్రమే కాకుండా యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలున్న రంగుల తయారీలోనూ వాడవచ్చునని, తేయాకు నుంచి వీటిని మరింత చౌకగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.  

Saturday, 2 June 2018

గంధంతో కేన్సర్ కు చెక్



మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. మన పెద్దవాళ్లు చెప్పే మాటల్ని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ.. ఇప్పుడు పరిశోధకులు సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి అవే నిజమని తేలుస్తున్నారు. తులసి, వేప ఆరోగ్యానికి చాలా మంచివని మనందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కానీ గంధంలో కేన్సర్ తగ్గించే గుణం ఉందని తెలిస్తే మనమంతా ఆశ్చర్యపోవాల్సిందే. గంధం కనీసం వాడక్కర్లేదని కేవలం వాసనకే కేన్సర్ దూరమౌతుందని రీసెర్చులు చెబుతున్నాయి.





     కేన్సర్‌ కణితులను అంతం చేయాలంటే రేడియేషన్‌ చికిత్స తప్పనిసరి. అయితే, మూత్రాశయ కేన్సర్‌ను అదుపులో పెట్టడానికి జర్మనీ శాస్త్రవేత్తలు వినూత్న ఆవిష్కరణ చేశారు. గంధపు సువాసనతో కేన్సర్‌ను అదుపులో పెట్టవచ్చని గుర్తించారు. గం ధపు వాసనలో ఉండే సాండ్రనాల్‌, సాంటనాల్‌ సమ్మేళనాలు కణితులపెరుగుదలను నిరోధిస్తాయని తేల్చారు.

Friday, 1 June 2018

కేన్సర్ సర్వైవల్ మంత్ జూన్




కేన్సర్ లక్ష మంది మహిళల్లో పల్లెల్లో 8మందికి, పట్టణాల్లో 27మందికి వస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది
-దేశ వ్యాప్తంగా ఏటా 5లక్షల మందిని బలిగొంటున్న మహమ్మారి
-ఆడవారిలో సర్వైకల్ కేన్సర్, మగవారిలో నోటి కేన్సర్లు పెరుగుతున్నాయని తేల్చిన పలు నివేదికలు
-సహజ జీవన శైలి, ముందస్తు పరీక్షలే శరణ్యమంటున్న వైద్యులు..




కేన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఇది సోకిందని తెలిసే నాటికే దాని తీవ్రత పెరిగి ఉండడం కేన్సర్ వ్యాధికి ఉన్న ప్రధాన లక్షణం. శరీరంలోని ట్రిగ్గర్ కణాలు కణవిభజనపై నియంత్రణ కోల్పోవడంతో కేన్సర్ ప్రారంభమవుతుంది. సంబంధిత పరీక్షల ఆధారంగా వ్యాధి ఉందని, అవయవం ఆధారంగా రకాన్ని తెలుసుకొని సరైన చికిత్స అందిస్తే కేన్సర్‌ను అరికట్టొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

కేన్సర్ అనేది అనేక వ్యాధుల సముదాయం. వాటన్నింటికి ఒకే సాధరణ లక్షణాలుంటాయి. శరీరంలోని ఏ భాగం నుంచి కేన్సర్ వచ్చిందో దాని ఆధారంగా వైద్యులు కేన్సర్ రకాన్ని నిర్ధారిస్తారు. తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, పొగ తాగడం, ప్రతికూల పరిసరాల ప్రభావం, కొన్ని అంటువ్యాధులు, జన్యుపరంగా వచ్చే కొన్ని లక్షణాలు కేన్సర్‌కి కారణమవుతాయి.

Thursday, 31 May 2018

జీవనశైలి మార్పులతో కేన్సర్ కు చెక్

మారుతున్న జీవనశైలి, పెరగుతోన్న పని ఒత్తిడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మోడ్రన్ లైఫ్ స్టయిల్ కారణంగా ఒబేసిటీతోపాటు డయాబెటీస్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు పెరుగుతోంది. ఇక కేన్సర్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడే మహిళల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. రొమ్ము కేన్సర్ మరణాలకు ప్రధాన కారణం అవగాహన లేమి అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.




బ్రెస్ట్ కేన్సర్‌ను ముందుగానే పసిగడితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. కానీ ప్రతి ఐదుగురిలో ఇద్దరు మహిళలకు మాత్రమే రొమ్ము కేన్సర్ ముందస్తు లక్షణాల గురించి అవగాహన ఉంది. జీవనశైలిలో మార్పుల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కొందరికి మాత్రమే తెలుసు. చాలా మంది రోజూ ఎక్సర్‌సైజ్ చేయడాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ చెమట చిందించడం వల్ల ఒంట్లోని విషతుల్యాలు బయటకు వెళ్లిపోతాయి. ఇంటి పనులు, సైక్లింగ్, వాకింగ్ వల్ల బ్రెస్ట్ కేన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు.

Wednesday, 30 May 2018

పొగాకుతో నోటి కేన్సర్




పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న వరల్డ్‌ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు.


40 ఏళ్ల క్రితం తనను ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. నోటి కేన్సర్ ను రూపుమాపేందుకు ఏర్పాటైన ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ మిషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పొగాకు, సుపారీకి అలవాటు పడి చాలా తప్పు చేశానని అన్నారు.
కేన్సర్ నుంచి బయటపడేందుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆపరేషన్ తనను చాలా బాధించిందని ఆయన చెప్పారు. సర్జరీ సమయంలో తన పళ్లు తీసేశారని అన్నారు. దానివల్లే తాను ఇప్పటికీ నోరు తెరవలేకపోతున్నానని ఆయన చెప్పారు. మాట్లాడేందుకు, ఆహారం తీసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ యువత దురలవాట్లకు లోనవుతోందని, అలాంటి వారిలో అవగాహన తెచ్చేందుకు సహాయపడతానని ఆయన చెప్పారు.