Monday, 22 August 2016

శృంగారమే దివ్యౌషధం

ప్రపంచంలో చాలామంది పురుషుల్ని పట్టి పీడిస్తున్న ప్రొస్టేట్ కేన్సర్ కు శృంగారమే పరమౌషధమని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ శృంగారంలో పాల్గొంటే ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తేలింది. నెలలో 21 రోజులు శృంగారంలో పాల్గొనే పురుషులకు.. ప్రొస్టేట్ కేన్సర్ వచ్చే అవకాశం 23 శాతం తగ్గుతోందట. అయితే శృంగారంలో కేవలం జీవిత భాగస్వామికే పరిమితమవ్వాలని, విశృంఖల శృంగారం కొత్త సమస్యలకు దారితీస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
       



రోజూ శృంగారంలో పాల్గొనడం కారణంగా ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్, టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయని. ఈ హార్మోన్లు కేన్సర్ ను నిరోధిస్తాయని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షా డెబ్భై వేల మంది కేన్సర్ తో బాథపడుతున్నారు. రోజూ వీర్యం బయటికి పోతుంటే.. శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఇకపై శృంగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సైంటిస్టులు సూచిస్తున్నారు. 

Saturday, 20 August 2016

కాఫీతో కేన్సర్ గ్యారెంటీ




పొద్దున లేవగానే కాఫీ తాగనిదే పూటగడవని పరిస్థితి.ఇది చాలామందికి అలవాటుగా మారింది.  మరీ వేడివేడి కాఫీ
తాగితే కేన్సర్ ఖాయమంటున్నారు పరిశోధకులు.  ఐరాసకు చెందిన అంతర్జాతీయ సంస్థ చేసిన పరిశోధనలో పలు కీలక విషయాలు వెల్లడించింది. కాఫీ వంటి పానీయాలతో అన్నవాహిక కేన్సర్ తలెత్తే  అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోదకులు తేల్చిచెప్పారు.



               65 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ వేడి ఉన్న పదార్థాలను అన్నవాహిక ద్వారా తాగితే కొన్ని రకాల కేన్సర్ లకు దారితీస్తున్నట్టు ఇందులో వెల్లడైంది.

Friday, 19 August 2016

కేన్సర్ గుర్తింపు చిటికెలో పని

పట్టుమని పదినిమిషాల్లో నోటి కేన్సర్‌ కణాలను గుర్తించే మైక్రోఫ్లూడిక్స్‌ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ డివైజ్‌ డెంటిస్ట్‌లకు సులభతరంగా, వ్యయపరంగా కూడా అందుబాటులో ఉంటుందని వారంటున్నారు. సర్వికల్‌ కేన్సర్‌తో సహా ఇతర కేన్సర్‌లను పరీక్షించేందుకు కూడా ఈ డివైజ్‌ ఉపకరిస్తుంది. లాబ్‌లో పెరిగే కేన్సర్‌ కణాలపై ఇది సమర్ధవంతంగా పనిచేస్తోంది. నోటి కేన్సర్‌ రోగుల నుండి బయోప్సిస్‌పై ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నారు.
                   

 చాలా వరకూ ఓరల్‌ కేన్సర్‌లు ప్రాథమిక దశలో నొప్పి ఉండకపోవడంతో రోగులు, వైద్యులు వాటిని గుర్తించలేకపోతారని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆన్‌ డెఫ్‌నెస్‌ అండ్‌ అదర్‌ కమ్యూనికేషన్‌ డిజార్డర్స్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగం అధిపతి కార్టర్‌ వాన్‌ వేస్‌ అంటున్నారు. ఈ ఏడాది 22,560 మందిలో ఓరల్‌ కేన్సర్‌ గుర్తించవచ్చని, 5000 మంది ఈ వ్యాధితో మరణించవచ్చని నేషనల్‌ కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. అస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ జాన్‌ మెక్‌డెవిట్‌ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 

Thursday, 18 August 2016

పొగ తాగితే కేన్సర్ ఖాయం

పన్నెండు రకాల కేన్సర్లు.. లక్షా అరవై ఏడు వేల మరణాలు.. కారణం మాత్రం ఒక్కటే. పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలే ఇవన్నీ.. అమెరికాలో ఏటా కేన్సర్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు సగంమంది ఊపిరితిత్తులు, శ్వాసనాళం, స్వరపేటికకు సంబంధించిన కేన్సర్లతోనే పోతున్నారని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వీటిలో చాలా మరణాలు కొని తెచ్చుకున్నవేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.  అట్లాంటాలోని అమెరికన్‌ కేన్సర్‌ సొసైటీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సిగరెట్‌ పొగ వల్ల 12 రకాల కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఊపిరితిత్తుల కేన్సర్‌ మొదటిది, ముఖ్యమైందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.



             ఏడాదిలో అమెరికా వ్యాప్తంగా పలు రకాల కేన్సర్లతో మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు కాగా అందులో 1.67 లక్షల మరణాలకు సిగరెట్‌ పొగే కారణమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన రెబెక్కా సీగల్‌ వివరించారు. ఈ గణాంకాలు కేవలం పొగరాయుళ్లవేనని, వారు వదిలే పొగతో కేన్సర్‌ బారిన పడ్డ వారిని లెక్కలోకి తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు వాడకంపై చైతన్యం తీసుకొచ్చే దిశగా ఎంతో చేయాల్సి ఉందని తెలిపారు.

Wednesday, 17 August 2016

బ్రెడ్డు తింటే కేన్సర్ బోనస్

ఆరోగ్యం బాగోలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్డు తినమని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తుంటారు. కానీ భారత ఆరోగ్య శాఖ నివేదిక చదివితే మాత్రం బ్రెడ్డు తిన్నా కేన్సర్ వస్తుందని తెలిసి జనం అవాక్కవుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల సంగతి దేవుడెరుగు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ కంపెనీలు యథేచ్ఛగా కేన్సర్ కారక పదార్థాలతో బ్రెడ్ తయారుచేసి విక్రయిస్తున్నాయి. బ్రిటానియా, కేఎఫ్ సీ, మెక్ డొనాల్డ్స్, డొమినోస్, పిజ్జా హట్ లాంచి రెస్టారెంట్లో ప్యాక్ చేసిన బ్రెడ్లో పొటాషియం బ్రోమైడ్, పొటాషియం అయొడైడ్ అవశేషాలున్నాయి.
             


ఆరోగ్య శాఖ పరీక్షించిన శాంపిల్స్ లో 84 శాతం కేన్సర్ కారక పదార్థాలున్నట్లు తేలింది. ఇవి తింటే కేన్సర్ కొని తెచ్చుకున్నట్లేనని అధికారులు ప్రకటించారు. అయితే బ్రాండెడ్ కంపెనీలు మాత్రం తాము నిషేధిత పదార్థాలు వాడటం లేదని చెవిలో పువ్వులు పెడుతున్నాయి. కానీ తమ ల్యాబుల్లో కాకుండా బయట ల్యాబుల్లో కూడా పరీక్షించాకే ఈ నివేదిక విడుదల చేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటికే ప్యాకేజ్డ్ బ్రెడ్ ను విదేశాల్లో నిషేధించారని, మన దేశంలో మాత్రం యథేచ్ఛగా అమ్ముతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. బ్రెడ్డు తినేముందు పారాహుషార్. 

Tuesday, 16 August 2016

వాయుకాలుష్యంతో కేన్సర్ ముప్పు

వాయు కాలుష్యంతో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.  ఈ ముప్పు ఆగ్నేయ ఆసియా దేశాల్లో అధికంగా ఉందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 20 కాలుష్య నగరాల్లో ఆగ్నేయాసియాలో 14 ఉన్నాయి. ప్రపంచంలో ఏటా 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నాని, వీటిల్లో మూడింట రెండో వంతు మరణాలు మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాల్లోనే ఉన్నాయంది. మరణాల్లో 22 శాతం పొగాకు, దాని ఉత్పత్తులు వాడకంతో సంభవిస్తున్నాయని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా రీజియన్‌లో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, భూటాన్, డీపీఆర్ కొరియా, ఇండోనేసియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ ఉన్నాయి.



ఈ ప్రాంతంలోని పరిశ్రమల్లో కార్మికులకు సూర్య కిరణాలు, కేన్సర్ కారక రసాయనాల నుంచి  రక్షణ లేదు. మద్యపానం, అనారోగ్యకర ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆటంకాలుగా మారాయి. పొగాకు, మద్యం వాడకం తగ్గించే దిశగా, పర్యావరణ పరిస్థితుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేలా కఠిన చట్టాలు తేవాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. ప్రపంచ కేన్సర్ దినం సందర్భంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. అలాగే హెచ్ పీవీ, హెపటైటిస్ బి, సీ, హెలికోబక్టర్ పైలోరి వల్ల వచ్చే   వ్యాధులు కేన్సర్‌కు కారణాలుగా ఉన్నాయన్నారు.

Monday, 15 August 2016

బాల్యంలో పండ్లు తింటే కేన్సర్ దూరం




బాల్యంలో పండ్లు ఎక్కువగా తింటే రొమ్ముకేన్సర్‌ బారిన పడే ముప్పు తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకుంటే ఈ కేన్సర్‌ మరింత అధికమయ్యే ముప్పుదని, అమెరికాలోని టిహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 90వేల మంది నర్సులను 20ఏళ్ల పాటు పరిశీలించారు. చిన్నతనంలో వాళ్ల ఆహారపు ఆలవాట్లు, పండ్లు అధికంగా తీసుకున్నారో లేదా వివరాలను సేకరించారు. చిన్నతనంలో ఎక్కువగా పండ్లు తీసుకున్న వారిలో రొమ్ముకేన్సర్‌ ముప్పు 25శాతం తక్కువగా ఉందని తెలిపారు.
                   



డాక్టర్లు సూచించే సమతులాహారంలో పండ్లు కూడా భాగంగా ఉంటాయి. చిన్నప్పుడే పండ్లు తినడం అలవాటైతే.. శరీరంలో రోగనిరోదశక శక్తి పెరిగి కేన్సర్ తో పాటు మరే వ్యాధులు త్వరగా దరిచేరవని సైంటిస్టులు ఎప్పట్నుంచో చెబుతున్నారు. పోషకాహారం, బలవర్థకమైన ఆహారం, సమతులాహారం, సంతులిత ఆహారం.. ఇలా పేరేదైనా ఆ ఆహారంలో పండ్లు మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. వెజ్ అయినా,. నాన్ వెజ్ అయినా పండ్లు తినకుండా వాటిలో దొరికే పోషకాలను మరో పదార్థాన్ని తినడం ద్వారా పొందలేమని పరిశోధనలు చెబుతున్నాయి.