Thursday 30 June 2016

డాక్టర్స్ డే స్పెషల్

వైద్యుడు లేనిచోట  ఆవాసమే ఏర్పాటుచేసుకోవద్దని సలహా ఇస్తాడు సుమతీశతకకారుడు. మరికొందరు... వైద్యుడంటే సాక్షాత్తూ నారాయణుడే అని ప్రస్తుతించారు. వైద్యుడు సాక్షాత్తూ నారాయణుడూ, హరీ కాబట్టే ‘యుద్ధం చేయలేను’ అంటూ యాంగ్జైటీకి, డిప్రెషన్‌కు గురైన అర్జునుడికి గీతాకౌన్సెలింగ్ నిర్వహించాడు. అలా అర్జునుడికి సైకోథెరపీ చికిత్స చేసిన తొలి సైకియాట్రిస్ట్‌గా గణుతికెక్కాడు శ్రీకృష్ణుడు. శివుడికి వైద్యనాథుడంటూ మరోపేరు. ఆయన వైద్యనాథుడు కాబట్టే వినాయకుడికి ఏనుగుతల అతికించి, బతికించాడు. దీన్ని తొలి ప్లాస్టిక్ సర్జరీ అని చాలామంది  అనుకుంటారుగాని... నిజానికి అది తొలి ‘హెడ్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ శస్త్రచికిత్స అనుకోవచ్చు. ఇలాంటి అద్భుతాలు చేసినందుకే ఆ దేవుళ్లు డాక్టర్ల హోదా పొందారు. పనిలోపనిగా మన ఇల-డాక్టర్లకూ సాక్షాత్తూ దేవతలతో  సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు మనుషులు.
                  తనకు కలిగిన రుగ్మతనూ, బాధనూ పోగొట్టగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి వైద్యుడు. ఆ నమ్మకాన్ని రోగిలో పాదుగొల్పడం కోసం వైద్యుడి వస్త్రధారణ హుందాగా ఉండటం ఎంతో ముఖ్యం. అప్పుడే రోగికి వైద్యుడి మీద నమ్మకం కలుగుతుంది. అందుకే మెడికల్ కాలేజీలో చేరాక శుభ్రంగా ఉంటేతప్ప అనాటమీ క్లాసులకు అనుమతించరు. వీటికి తోడు డాక్టర్ తెల్లకోటును ధరించి ఉండాలి. ఈ తెల్లకోటును చూసిన వెంటనే దేవదూత ఆరోగ్యాన్నివ్వడానికి వస్తున్నాడన్న నమ్మకం కలగాలి. కానీ ఈ నమ్మకం ఇప్పుడు సడలుతోందేమోనన్న సందేహం వస్తోంది. కొందరికి ఈ తెల్లకోటు చూస్తేనే ఆందోళన. వైద్యశాస్త్రంలో.. వైట్‌కోట్ హైపర్‌టెన్షన్ అంటూ దీన్ని చూడగానే రక్తపోటు పెరిగిపోయే రుగ్మతను ‘వైట్‌కోట్ సిండ్రోమ్’ అని ఒక వ్యాధే రూపొందింది. స్వతహాగా వైద్యమంటే భయం ఉండే ఈ వ్యాధిని తమ ప్రవర్తనతోనే పూర్తిగా రూపుమాపాల్సిన బాధ్యత ఆ వైట్‌కోట్‌లు ధరించిన వారిపైనే ఉంది. అదీ దీని ఘనత.


             రోగి వైద్యుడిని నమ్మి అతడి వద్దకు వస్తాడు. అతడిపై విశ్వాసం ఉంచి వైద్యం చేయించుకుంటాడు. రోగి ఎవరైనా సరే... అతడి గురించిన సమాచారాన్ని వైద్యుడు గోప్యంగా ఉంచాలి. రోగి అనుమతి లేకుండా,  అతడి రోగానికి సంబంధించిన సమాచారం, ఫొటోల వంటివాటిని ఉపయోగించకూడదు. ఇది నైతికనియమం. మామూలు రోగుల పట్లనే గాక, నేరస్తులు, నిందితుల వంటి వారిపట్ల కూడా వైద్యుడు వీటిని పాటించాలి. లాడెన్‌ను పట్టుకునేందుకు అమెరికా ఒక వైద్యుడిని  నియోగించింది. డాక్టర్ షకీల్ ఆఫ్రీదీ అనే వైద్యుడిని లాడెన్ వద్దకు పంపి, అతడి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి, అతడే లాడెన్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాడి చేసింది. ఆ తర్వాత డాక్టర్ షకీల్‌ను వైద్యనియమావళి ఉల్లంఘించాడన్న ఆరోపణతో ఒకవైపు పాకిస్థాన్ అతడిని జైల్లో పెట్టింది. మరోవైపు అమెరికా... ముఖం చాటేసింది. రోగి ఎవరైనాసరే అతడి తాలూకు, అతడి జబ్బు తాలూకు రహస్యాలను గోప్యంగా ఉంచడం అన్న నైతిక నియమాన్ని పాటించనందుకు డాక్టర్ షకీల్ అఫ్రీదీ కెరియర్ పూర్తిగా నాశనమైంది.

  ఒక రోగి డాక్టర్‌గా మిమ్మల్ని పూర్తిగా నమ్మేలా చూసుకోండి. విశ్వసించేలా చేసుకోండి. అప్పుడే వైద్యుడు నారాయణుడవుతాడు. వైద్యవిద్యా పారీణుడవుతాడు. వైద్యసేవా పరాయణుడవుతాడు.

No comments:

Post a Comment