Wednesday 30 May 2018

పొగాకుతో నోటి కేన్సర్




పొగాకుతో నేడు ఎన్నో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి. సిగరెట్‌ తాగడం వల్ల గుండె, ఊపిరతిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు క్యాన్సర్‌, డయాబెటిస్‌, ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఆస్తమా రావడానికి సిగరెట్‌ తాగడం కూడా ఓ కారణమే. పొగ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏడాది మిలియన్‌ మంది ప్రజలు దీంతో మృతిచెందుతున్నారు. దీంతో పాటు పొగాకుతో కూడిన గుట్కా కూడా మనిషికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధులపట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31న వరల్డ్‌ నో టొబాకో డేను నిర్వహిస్తున్నారు.


40 ఏళ్ల క్రితం తనను ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. నోటి కేన్సర్ ను రూపుమాపేందుకు ఏర్పాటైన ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ మిషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పొగాకు, సుపారీకి అలవాటు పడి చాలా తప్పు చేశానని అన్నారు.
కేన్సర్ నుంచి బయటపడేందుకు శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆపరేషన్ తనను చాలా బాధించిందని ఆయన చెప్పారు. సర్జరీ సమయంలో తన పళ్లు తీసేశారని అన్నారు. దానివల్లే తాను ఇప్పటికీ నోరు తెరవలేకపోతున్నానని ఆయన చెప్పారు. మాట్లాడేందుకు, ఆహారం తీసుకునేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇప్పటికీ యువత దురలవాట్లకు లోనవుతోందని, అలాంటి వారిలో అవగాహన తెచ్చేందుకు సహాయపడతానని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment